Arijit Singh | బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించడం సంగీత ప్రపంచంలో సంచలనంగా మారింది. ఇకపై కొత్త సినిమాలకు పాటలు పాడనని, కొత్త ప్రాజెక్టులు అంగీకరించనని స్పష్టం చేసిన అర్జిత్, ఈ నిర్ణయం వెనుక తన ఆలోచనలను కూడా వెల్లడించారు. తనకు కొత్తదనం చాలా ఇష్టమని, అందుకే పాటలను ఎప్పుడూ ఒకేలా పాడనని, ఇప్పుడు కొత్త గాయకుల పాటలు వినాలని, వారికి అవకాశాలు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ అనూహ్య నిర్ణయం సంగీత ప్రియులను మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానులను షాక్‌కు గురిచేసింది. సింపుల్ లైఫ్‌స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన అర్జిత్ సింగ్, లగ్జరీకి దూరంగా సాధారణ జీవితం గడుపుతాడు. సొంతూరికి వెళ్లినప్పుడు స్కూటీపై సాధారణ బ్యాగ్‌తో తిరుగుతూ కనిపిస్తాడు, షాపింగ్‌కు వెళ్లినప్పుడు కూడా అతి సాధారణంగా ఉంటాడు.
అతని చెప్పులు, దుస్తులే అతని సింప్లిసిటీని చెప్పకనే చెబుతాయి. కానీ ఈ సాదాసీదా జీవితం వెనుక కోట్ల రూపాయల ఆదాయం దాగి ఉంది. అర్జిత్ సింగ్ పాటలు పాడటం ద్వారానే కాకుండా, ఓరియన్ మ్యూజిక్ పేరుతో ఉన్న తన స్టూడియో, యూట్యూబ్, స్పాటిఫై, గానా వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భారీగా ఆదాయం సంపాదిస్తున్నాడు. లైవ్ కాన్సర్ట్ల విషయానికి వస్తే, రెండు గంటల షోకు సుమారు 14 కోట్ల రూపాయలు వసూలు చేస్తాడని సమాచారం, అలాగే చిన్న లేదా ప్రైవేట్ షోల కోసం దాదాపు 2 కోట్ల రూపాయలు తీసుకుంటాడని చెబుతారు. బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా ఒక్కో పాటకు 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు, రాయల్టీలు కలిపితే ఈ మొత్తం మరింత పెరుగుతుంది. ఈ విషయాలపై అర్జిత్ స్వయంగా ఎప్పుడూ బహిరంగంగా స్పందించకపోయినా, ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
వెస్ట్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా చిన్న గ్రామానికి చెందిన అర్జిత్ సింగ్ ఇప్పటివరకు దాదాపు 400కు పైగా పాటలు పాడి, అనేక భాషల్లో లైవ్ షోలు నిర్వహించాడు. లైవ్ మింట్ నివేదికల ప్రకారం అతని మొత్తం నెట్ వర్త్ సుమారు 414 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడుతోంది. ఇందులో నవీ ముంబైలోని దాదాపు 8 కోట్ల విలువైన ఇల్లు, 3.4 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. రేంజ్ రోవర్, మెర్సిడెస్ వంటి హైఎండ్ కార్లు ఉన్నప్పటికీ, వాటిని పెద్దగా ప్రదర్శించకుండా సింపుల్‌గా జీవించడమే అర్జిత్ సింగ్ ప్రత్యేకత. ఇలాంటి స్టార్ సింగర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం సంగీత రంగంలో ఒక యుగానికి ముగింపు అన్నట్లుగా భావిస్తున్నారు.