Jayashankar Director | ‘పేపర్ బాయ్’ వంటి సున్నితమైన, బాధ్యతాయుతమైన ప్రేమకథతో దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన జయశంకర్ సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రూపొందించిన చిత్రం ‘అరి (My Name is Nobody)’. ఎన్నో ప్రత్యేకతలు, అంతర్జాతీయ అవార్డులతో ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఏడేళ్లు ఆలస్యం ఎందుకు?
తన మొదటి చిత్రం ‘పేపర్ బాయ్’ అందించిన విజయం తర్వాత, రెండో సినిమా దానికంటే గొప్పగా ఉండాలనే లక్ష్యంతో జయశంకర్ ప్రయాణం సాగింది. ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయే కథను చెప్పాలనే ఉద్దేశంతో ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని ఒక కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. అదే ‘అరి’ కాన్సెప్ట్. ‘అరి’ అనే పేరుకు శత్రువు అని అర్థం ఉన్నా, ముఖ్యంగా అరిషడ్వర్గాలలో (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) మొదటి రెండు పదాలను సూచిస్తుందని దర్శకుడు తెలిపారు. కేవలం కాన్సెప్ట్‌ను ఎంచుకోవడమే కాకుండా, దాని వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, అరిషడ్వర్గాలపై పూర్తి అవగాహన కోసం జయశంకర్ తీవ్రంగా పరిశోధన చేశారు.
ఈ అరుదైన కాన్సెప్ట్‌ను సిల్వర్ స్క్రీన్‌పైకి తీసుకురావడానికి, దర్శకుడు మైథలాజికల్ టచ్ ఇస్తూ.. పురాణేతిహాసాలను తిరగేశారు. అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకునే రహస్యం గ్రంథాల్లో ఎందుకు లేదో తెలుసుకోవడానికి రమణ మహర్షి ఆశ్రమంతో పాటు ఎందరో గురువులను (గురూజీలను) కలిసి, వారి సమయం కోసం నిరీక్షించారు. ఆధ్యాత్మిక కోణంలో అరిషడ్వర్గాలపై అధ్యయనం చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా, ఈ లోతైన విషయాలను తన ప్రత్యేక మేకింగ్ స్టైల్‌తో వెండితెరపై ఆవిష్కరించడానికి ఆయన అనేక సంవత్సరాలు కష్టపడ్డారు.
అంతర్జాతీయ గుర్తింపు, ప్రశంసలు
‘అరి’ చిత్రం విడుదల కాకముందే పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శితమై, దాదాపు 25 అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఈ సినిమాను వీక్షించిన మాజీ ఉపరాష్ట్రపతి *వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు, పీఠాధిపతులు చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే విడుదలైన ‘చిన్నారి కిట్టయ్య’ పాట కల్చరల్ ఫంక్షన్లలో, ఆలయ ఉత్సవాల్లో వినిపించే బ్లాక్‌బస్టర్‌గా మారింది. అలాగే, ‘భాగా భాగా’ పాట తన సాహిత్య విలువతో శ్రోతలను ఆకట్టుకుంటోంది. ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం పంపిణీ అవుతోంది. అరుదైన కాన్సెప్ట్, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రాఫ్ట్తో ‘అరి’ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలోకి రానుంది. జయశంకర్ ఏడేళ్ల కృషి ఫలించి, ‘అరి’ సినిమా అరిషడ్వర్గాలపై ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని ఆశిద్దాం.