ఉత్తరాదిలో పెద్ద పండుగైన ‘కర్వా చౌత్’ లేకుండా.. బాలీవుడ్లో కుటుంబ కథా చిత్రాన్ని తీయలేమని అంటున్నది ‘మిసెస్’ డైరెక్టర్ ఆరతి కడావ్. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘మిసెస్’ చిత్రంలోని కర్వా చౌత్ సన్నివేశం గురించిన సంగతులను పంచుకున్నది. నిజానికి ‘మిసెస్’ మాతృక ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’.. కేరళ నేపథ్యంలో సాగుతుంది. అందులో దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు కనిపిస్తాయి. అయితే, ఆరతి ఈ సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు.. తాను పెరిగిన వాతావరణాన్ని, అక్కడి ఆచార వ్యవహారాలనూ చూపించాలని అనుకున్నదట. అప్పుడు.. ‘కర్వా చౌత్‌ను చూపించకుండా బాలీవుడ్లో ఓ కుటుంబ కథా చిత్రాన్ని ఎలా తీయగలం?’ అని తనకు తానే ప్రశ్నించుకున్నదట. వెంటనే.. ఈ పండుగను సినిమాలో భాగం చేసినట్టు వెల్లడించింది.
షూటింగ్ ముగియడానికి కేవలం 20 రోజుల ముందు ఈ సన్నివేశాన్ని తీశారట. ఈ సందర్భంగా ఆరతి మాట్లాడుతూ.. “సినిమాల్లో ఆచార వ్యవహారాలను చూపించడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సన్నివేశాలను చూపించాల్సి వస్తుంది. అలాంటిదే.. ఈ కర్వా చౌత్ సన్నివేశం. నిజానికి ఈ సంప్రదాయాన్ని బాలీవుడ్ తనదిగా చేసుకుంది. ఎంతలా అంటే.. కొన్ని తరాలను ప్రభావితం చేసే స్థాయికి ‘కర్వా చౌత్’ను తీసుకెళ్లింది” అంటూ చెప్పుకొచ్చింది.
‘మిసెస్’ సినిమా చూసిన ప్రేక్షకులు ఒక్క క్షణమైనా తమ ఇంట్లో ఆడవాళ్లు పడే కష్టాన్ని గుర్తిస్తారనీ, ఆ లక్ష్యంతోనే ఈ సినిమా తీశామని చెబుతున్నది దర్శకురాలు ఆరతి కడావ్. ఇక ‘మిసెస్’ సినిమా విషయానికి వస్తే.. 2021లో విడుదలైన మలయాళ చిత్రం ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’కి హిందీ రీమేక్‌గా రూపొందింది. దంగల్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న ‘సాన్యా మల్హోత్రా’.. ఇందులో ప్రధాన పాత్ర పోషించింది.