Kantara Chapter 1 | రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కాంతార చాప్టర్ 1’ మరి కొద్ది గంటలలో థియేటర్స్‌లోకి రానుంది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుండగా, అక్టోబర్ 1 (బుధవారం) రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోకి ప్రభుత్వం ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. ఇక కేవలం ప్రీమియర్ షోలకే కాకుండా, అక్టోబర్ 2 నుంచి 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక అధికారిక జీవో విడుదల చేసింది. పెంపు వివరాలు ఇలా ఉన్నాయి.
సింగిల్ స్క్రీన్ థియేటర్లు: ₹75 వరకు (జీఎస్టీ అదనంగా), మల్టీప్లెక్స్‌లు: ₹100 వరకు (జీఎస్టీ అదనంగా). ఈ పెంపు ధరలు ప్రీమియర్ షోలకు కూడా వర్తించనున్నాయి. ఈ నిర్ణయంపై చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. మంచి సినిమాలకు ప్రోత్సాహంగా ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయాన్ని హోంబలే ఫిలిమ్స్ అభినందించింది. ఇటీవల తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఎదురవుతున్న ఇబ్బందులపై పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో ‘కాంతార’ చిత్రానికి ఏపీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రాంతీయ భావాల కన్నా జాతీయ భావనకే ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి సినిమాలకు మద్దతు ఇచ్చే మనసు ప్రతి ఒక్కరిలో ఉండాలి. ‘కాంతార 1’పై ఆటంకాలు సృష్టించడమన్నది అన్యాయమే. టికెట్ ధరల పెంపు విజ్ఞాపనను ప్రభుత్వం అర్థవంతంగా పరిగణించి అనుమతి ఇచ్చిన తీరు అభినందనీయం” అని పవన్ కల్యాణ్ అన్నారు. ఇక ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆవిష్కరించి డివోషనల్ అంశాలతో తీర్చిదిద్దిన రిషబ్ శెట్టి ని ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరై సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చారు.