Anvesh | ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ప్రాంతానికి చెందిన అన్వేష్.. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ, విదేశాలు తిరుగుతూ అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, వింతలు, విడ్డూరాలను పరిచయం చేస్తుంటాడు. ఆ క్రమంలో విపరీతమైన ఫాలోవర్స్ ఏర్పరచుకున్నాడు. నెలకు కోటి వరకు సంపాదించే రేంజ్‌కు వెళ్లాడు. ఇక ఇటీవల బెట్టింగ్ యాప్స్ గురించి ఎక్కువగా వీడియోలు చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్‌ల కారణంగా ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారని చెబుతూ .. చట్ట విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలు, యూట్యూబర్లను టార్గెట్ చేస్తూ రోజుకొకరి బండారం బయటపెడుతున్నాడు..
ఇటీవల కొందరు సెలబ్రెటీలపై వీడియో చేసి ఏకంగా ఉగ్రవాదులతో లింక్ పెట్టాడు. ఆ తర్వాత ప్రభుత్వం పెద్దలనే అన్వేష్ టార్గెట్ చేశాడు. తెలంగాణ డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో కొందరు అధికారులు రూ.300 కోట్లు దోచేశారంటూ ఆరోపించాడు. దీంతో తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసిన అభియోగాలపై అన్వేష్‌పై కేసు నమోదు చేసింది. వీడియోను సుమోటోగా తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.తనపై కేసు నమోదు కావటంపై ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ స్పందించారు.
నేను రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ నిర్మూలన కోసం సామాజిక బాధ్యతతో అందరికి అవగాహన కల్పిస్తున్నాను. అలా చేసినందుకు నాపై కేసు పెట్టడం ఏంటి? ఎన్నోఏళ్లుగా మెట్రో రైలులో బెట్టింగ్ యాప్ యాడ్స్ వేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా నాపై కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించాడు అన్వేష్. నేను బెట్టింగ్ యాప్స్ ద్వారా బలైన కుటుంబాలకి రూ.2 లక్షల ఆర్ధిక సాయం చేశాను. ఇప్పటి వరకు ఐదు కుటుంబాలకి ఆర్ధిక సాయం అందించాను అని అన్వేష్ అన్నారు. కాగా, అన్వేష్ తీరు దేశానికి వ్యతిరేకంగా ఉండటంతో పాటు సదరు అధికారుల పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా ఉండడంతో పోలీసులు సీరియస్ అయినట్టు తెలుస్తుంది.