కొన్ని వార్తలు వినడానికే ఆశ్చర్యంగా ఉంటాయి. పదహారేండ్ల క్రితం అనుష్క నటించిన బ్లాక్‌బస్టర్ ‘అరుంధతి’.. కోలీవుడ్‌లో ఇప్పుడు రీమేక్ కానున్నదట. మరి ఇంతకీ తమిళ జేజమ్మ ఎవరు? అనంటే ఊహించని సమాధానం కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నది. తమిళ జేజమ్మగా శ్రీలీల నటించనున్నదట. నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు, ప్రముఖ దర్శకుడు మోహన్‌రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. నిజానికి తెలుగునాట ‘అరుంధతి’ సినిమాకు ప్రత్యేకమైన అభిమానులున్నారు.
ఆ సినిమాను అంత గొప్పగా మలిచారు లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ. మరి మోహన్‌రాజా ఆ స్థాయిలో అరుంధతిని తెరకెక్కించగలడా? అసలు జేజమ్మగా, అరుంధతిగా రెండు పొంతన లేని బరువైన పాత్రలను అద్భుతంగా పోషించి అదరగొట్టేశారు అనుష్క. మరి ఆ స్థాయిలో శ్రీలీల న్యాయం చేయగలదా? అనేది చాలామందిలో నెలకొన్న ప్రశ్నలు. మరో విషయం ఏంటంటే.. ‘అరుంధతి’ హిందీలో కూడా త్వరలో రీమేక్ కానున్నది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. మరి హిందీ ‘అరుంధతి’ ఎవరో తెలియాల్సి వుంది.