‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత అనుష్క నుంచి సినిమా రాలేదు. సాధారణంగా ఒక సినిమా విజయం సాధిస్తే.. దాని ఆసరాగా తీసుకొని పది సినిమాలకు సంతకాలు చేసేస్తుంటారు కథానాయికలు. కానీ అనుష్క మాత్రం అందుకు మినహాయింపే. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత ఆమె వరుసపెట్టి సినిమాలు ఒప్పుకోలేదు. నచ్చిన ప్రాజెక్ట్‌కే సంతకం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె తెలుగులో ‘ఘాటి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో విడుదల చేసేందుకు నిర్మాతలు రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర గంజాయి తోటల నేపథ్యంలో సాగే కథ ఇది. ఇదిలావుంటే.. ఈ సినిమాతోపాటు అనుష్క ‘కథనార్’ అనే మలయాళ సినిమా కూడా చేస్తున్నది.
9వ శతాబ్దంలో కడమట్టతు అనే క్రైస్తవ పూజారి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇందులో అనుష్క ‘కాలియన్ కట్టు నీల’గా కీలక పాత్ర పోషిస్తున్నది. అలాగే యూవీ క్రియేషన్స్వారు స్వీటీతో ‘భాగమతి 2’ చేయడానికి రెడీ అవుతున్నారు. అనుష్క అందుబాటుని బట్టి ఆ సినిమా పట్టాలెక్కుతుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించనున్న సినిమాలో ప్రభాస్‌కి జోడీగా అనుష్క మెరవనున్నదని శాండిల్‌వుడ్‌లో ఓ టాక్ కూడా వినిపిస్తున్నది. ఈ లైనప్‌ని చూస్తుంటే.. స్వీటీ ఇన్నింగ్స్ మళ్లీ మొదలవ్వడం ఖాయమే అనిపిస్తున్నది.