Dhurandhar | బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘ధురంధర్’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా బీజేపీ ప్రాపగండా అని విమర్శలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను చూసిన అనురాగ్ కశ్యప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చిత్రంలోని మేకింగ్‌ను ఆకాశానికెత్తిన ఆయన, కథలోని కొన్ని రాజకీయ అంశాలపై మాత్రం తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
“ధురంధర్ నిజంగా ఒక అద్భుతమైన చిత్రం. ముఖ్యంగా కథ మొత్తం పాకిస్థాన్ నేపథ్యంలో సాగడం, ఆ వాతావరణాన్ని అద్భుతంగా తెరకెక్కించడం నన్ను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో రెండు చోట్ల నాకు ఇబ్బందిగా అనిపించింది. ఒకటి మాధవన్ చెప్పే ‘దేశం గురించి ఆలోచించే రోజు వస్తుంది’ అనే డైలాగ్‌తో పాటు.. రెండోది చివర్లో రణవీర్ సింగ్ చెప్పే ‘ఇది నవ భారతం’ (Ye Naya India Hai) అనే డైలాగ్. ఈ రెండూ ఒక పార్టీకి చెందిన ప్రచార (Propaganda) ధోరణిలో ఉన్నాయని నా అభిప్రాయం. ఆ రెండు డైలాగులను పక్కన పెడితే ఇది ఒక బ్రిలియంట్ ఫిల్మ్ అని అనురాగ్ అన్నారు.
అలాగే చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ గురించి మాట్లాడుతూ.. నాకు ఆదిత్య చాలా కాలం నుంచి తెలుసు. ఆయన ఒక కాశ్మీరీ పండిట్, వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆయన సినిమాల్లో కనిపించే రాజకీయం ఆయన సొంతం నిజాయితీతో కూడుకున్నది. ఇతర దర్శకుల్లా ఆయన కేవలం అవకాశాల కోసం ఇలాంటి సినిమాలు తీయరు. హాలీవుడ్ ఆస్కార్ అందుకున్న హిట్ చిత్రాలైన ది హర్ట్ లాకర్, జీరో డార్క్ థర్టీ వంటి సినిమాలు కూడా అమెరికా అనుకూల ప్రచార చిత్రాలే. వాటిని మనం ఎలా ఆదరించామో, ఈ సినిమాను కూడా అలాగే చూడాలి అని అనురాగ్ అన్నారు. రణవీర్ సింగ్ తన కెరీర్లోనే అత్యంత పరిణతి చెందిన నటనను కనబరిచారు. ఆయన పెర్ఫార్మెన్స్ చాలా సెక్యూర్డ్‌గా ఉంది. టెక్నికల్ గా ఈ సినిమా హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోదు అని అనురాగ్ కొనియాడారు.
#AnuragKashyap about MEGA BLOCKBUSTER #Dhurandhar 🤯 pic.twitter.com/o2VTEZUcgP
— CineHub (@Its_CineHub) January 4, 2026