భారత స్టార్ బ్యాటర్ విరాట్‌కోహ్లి బయోపిక్ తెరకెక్కించడానికి బాలీవుడ్లో పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. కోహ్లి సమ్మతిస్తే ఆయన జీవితకథను వెండితెర మీదకు తీసుకొచ్చేందుకు సిద్ధమని అగ్ర దర్శకులు కూడా పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో విరాట్‌కోహ్లి బయోపిక్ గురించి అగ్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కోహ్లి బయోపిక్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినా తాను ఆ ఆఫర్‌ను స్వీకరించనని తెలిపారు. ‘కోహ్లితో నాకు ఎంతో అనుబంధం ఉంది. అతను అందంలోనూ వ్యక్తిత్వంలోనూ చాలా గొప్పవాడు.
మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో బయట అంత సౌమ్యంగా కనిపిస్తాడు. క్రికెట్ అభిమానులతో పాటు సాధారణ ప్రజల దృష్టిలో కూడా అతను ఓ హీరో. ముఖ్యంగా పిల్లలు ఆయన్ని ఎంతగానో ఇష్టపడతారు. కోహ్లి ఓ అద్భుతం. ఒకవేళ నేను బయోపిక్ తీయాల్సివస్తే సాధారణ వ్యక్తి జీవితాన్నే చూపిస్తాను. కోహ్లి వంటి గ్రేట్ హీరో బయోపిక్కు నేను న్యాయం చేయలేను’ అన్నారు. కోహ్లి బయోపిక్‌లో అగ్ర హీరో రామ్‌చరణ్ నటించనున్నారని గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే.