Anupama Parameswaran | సొగసైన అందంతో కుర్రాళ్ల హృదయాలని దోచుకుంటున్న అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ప్రధానంగా తెలుగు, మలయాళం, తమిళ చిత్రాలలో నటిస్తోంది. 18 ఫిబ్రవరి 1996 న కేరళలోని ఇరింజలకుడాలో జన్మించిన అనుపమ తన నటనా జీవితాన్ని 2015 లో విడుదలైన “ప్రేమమ్” అనే మలయాళ చిత్రంతో ప్రారంభించింది. 2016 లో అనుపమ “అ ఆ” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో ఆమె నాగవల్లి పాత్రను పోషించి, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . తాజాగా నటి అనుపమ పరమేశ్వరన్ తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న విమర్శలు, ట్రోలింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
మలయాళంలో తాను ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ఈ చిత్రానికి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటుడు సురేశ్ గోపి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో మలయాళ ప్రేక్షకులను కొత్త కోణంలో మెప్పిస్తానని అనుపమ అంటుంది. ఇక ఈ మూవీ ప్రచార కార్యక్రమంలో భాగంగా, అనుపమ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో మంచి నటి కాదంటూ నేను తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొన్నాను. ఆ విమర్శలు మొదట్లో చాలా బాధించాయి. అవే తనలో నమ్మకాన్ని పెంచాయని, నటిగా ఎదగాలన్న కసిని పెంచాయని చెప్పుకొచ్చింది అనుపమ.
కోవిడ్ కాలంలో తాను వ్యక్తిగత, వృత్తిపరమైన సవాళ్లు ఎదుర్కొన్నట్టు పేర్కొంది.అప్పట్నుంచి కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని గ్రహించిందట. ప్రేక్షకులకు చేరువయ్యే బలమైన కథలవైపు దృష్టి సారించాలనే నిర్ణయానికి వచ్చినట్టు అనుపమ స్పష్టం చేసింది. దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ తనపై నమ్మకాన్ని ఉంచి ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ లాంటి ఆసక్తికర చిత్రంలో అవకాశం ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు అనుపమ.ఈ నేపథ్యంలో తనను ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్న అభిమానులతో పాటు, విమర్శించిన వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి విమర్శలే నన్ను ధృడంగా మార్చాయి అని అనుపమ పేర్కొంది.