Paradha | అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన పరదా చిత్రం.. ఈ నెల 22న థియేటర్లలో అలరించనుంది. ఈ సినిమా విడుదలకు ముందే.. ప్రీమియర్ షోలు వేశారు. ఇక ప్రమోషన్లు కూడా బాగానే నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో అనుపమ మాట్లాడుతూ.. రివ్యూలు నచ్చితేనే మా సినిమా చూడండి అని ఆమె చెప్పారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథాంశం ఏంటి..? అనే విషయాలను మూవీ రివ్యూలో చూద్దాం..
పరదా కథేంటి అంటే..?
పడతి అనే ఊర్లో వయసుకొచ్చిన ప్రతి అమ్మాయి ముఖానికి పరదా కప్పుకొని తిరుగుతుంటుంది. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. ఎందుకంటే ఏ అమ్మాయి అయినా పొరపాటున పరదా తీసి గ్రామంలో నడిస్తే.. వారు గ్రామ దేవత జ్వాలమ్మకు ఆత్మాహుతి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదే గ్రామంలో ఉండే సుబ్బు (అనుపమ), రాజేశ్ (రాగ్ మయూర్) ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఈ జంటకు పెళ్లి చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఎంగేజ్మెంట్ రోజునే.. సుబ్బు ఫొటో కారణంగా.. ఆమె ఆత్మాహుతి చేసుకోవాలని గ్రామ పెద్ద నిర్ణయం చేస్తారు. ఆ ఫొటోలో తన తప్పేం లేదని చెప్పినప్పటికీ పెద్దలు వినిపించుకోరు. దీంతో తప్పని పరిస్థితుల మధ్య సుబ్బు తన ఊరి దాటి ధర్మశాల వెళ్లాల్సి వస్తుంది. ఈమెకు తోడుగా రత్న(సంగీత), అమిష్ట(దర్శన రాజేంద్రన్) కూడా వెళ్తారు. ఇంతకీ ధర్మశాల ఎందుకు వెళ్లారు? చివరకు సుబ్బు.. పరదా తీసిందా లేదా అనేది మిగతా స్టోరీ..
మూవీ ఎలా ఉందంటే..?
ప్రధానంగా ఇటీవలి కాలంలో హీరోయిన్ ఓడియెంటెడ్ సినిమాలు కాస్త తగ్గాయనే చెప్పొచ్చు. ఈ లోటును భర్తీ చేసేందుకు వచ్చిన సినిమానే పరదా అని చెప్పొచ్చు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు అంటూ ఎవరు ఉండరు. కథే మెయిన్ హీరో అని చెప్పొచ్చు. ఈ సినిమా నేపథ్యం పడతి గ్రామంలో జ్వాలమ్మ జాతరతో ఆరంభమవుతుంది. ఈ ఊరిలోని ఈడొచ్చిన అమ్మాయిలు, మహిళలు ఎందుకు పరదా కప్పుకోవాల్సి వచ్చిందనేది మొదటి పది నిమిషాల్లోనే తోలుబొమ్మలాట కథతో చెప్పేస్తారు. తర్వాత సుబ్బు, రాజేశ్ ప్రేమ.. నిశ్చితార్థం.. అనుకోని అవాంతరం వల్ల అది ఆగిపోవడం.. ఇలా కథలో సంఘర్షణ ఏర్పడుతుంది. తన తప్పు లేదని చెబుతున్నా సరే సుబ్బుని ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు ఆదేశించడం.. తర్వాత అనుకోని పరిస్థితుల్లో సుబ్బు.. మరో ఇద్దరు మహిళలతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వెళ్లాల్సి రావడం జరుగుతుంది.
ధర్మశాల వెళ్లాక ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ఒకప్పటి అమ్మాయిలతో పోలిస్తే.. నేటి అమ్మాయిల్లో చైతన్యం పెరిగిందని చెప్పొచ్చు. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా.. అనేక రంగాల్లో ఎవరూ ఊహించని విధంగా రాణిస్తున్నారు. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాల కారణంగా అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. ఆచార, సంప్రదాయాలు అని చెప్పి.. నాలుగు గోడల మధ్యే బంధి చేస్తున్నారు. అలాంటి గ్రామానికి చెందిన ఓ యువతి.. తన ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఎలాంటి సాహసం చేసింది? మూఢనమ్మకాలపై ఎలా పోరాడింది అనే కల్పిత కథతో తీసిన సినిమానే ఇది.
సినిమా అంతా సుబ్బు పాత్ర పరదా కప్పుకొని ఉంటుంది. ఆమె పూర్తిగా పరదా తీసేసే సన్నివేశంలో సీతాకోక చిలుక రిఫరెన్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సుబ్బుతో పాటు జర్నీ చేసే రత్న ఓ గృహిణి, ఆమిష్ట ఓ ఇంజినీర్. ఈ పాత్రల్ని ప్రారంభించిన తీరు, ముగించిన తీరు కూడా అందర్నీ మెప్పిస్తుంది. సెకండాఫ్ మొదలవగానే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ వస్తుంది. ఉన్నది కాసేపే అయినా.. ఆయన చెప్పే ఓ స్టోరీ, డైలాగ్స్ మంచి ఎమోషనల్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో సుబ్బు పాత్ర.. దేవుడికి కట్టిన వస్త్రాల్ని తగలబెట్టే సీన్, ఊరి ప్రజల కళ్లు తెరిపించింది అనేలా విజువల్‌గా చూపించడం సూపర్బ్. ఈ సినిమా ప్రతి అమ్మాయి చూడాల్సిన మూవీ. చూస్తున్నంతసేపు కచ్చితంగా ఎమోషనల్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సినిమాటోగ్రఫీ సూపర్బ్. టెక్నికల్ టీమ్ కూడా సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ కాస్త లౌడ్‌గా అనిపించింది కానీ మిగతా చోట్ల సెట్ అయింది. చివరగా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల గురించి చెప్పుకోవాలి. గతంలో సినిమా బండి, శుభం అని సినిమాలు తీశాడు. అవి మోస్తరుగా అనిపించాయి కానీ ఈ మూవీతో తనలో చాలానే విషయం ఉందని నిరూపించాడు. ఫిమేల్ సెంట్రిక్ తరహా సినిమాలంటే ఇష్టముంటే మాత్రం ‘పరదా’ మిస్ కావొద్దు.
రేటింగ్ – 3