Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పరదా’. ఈ సినిమాకు ప్రవీణ్ కాండ్రేగులా దర్శకత్వం వహించగా ఆగష్టు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలపై తాజాగా స్పందించింది అనుపమ.
‘పరదా’ సినిమా విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ.. కమర్షియల్ సినిమాల్లో ఎన్ని తప్పులు ఉన్నా విమర్శకులతో పాటు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరని, కానీ ప్రయోగాత్మక, నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలను తెరకెక్కిస్తే అందులో వెయ్యి తప్పులు వెతుకుతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి ధోరణులు కనిపిస్తుంటాయని తెలిపారు. కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే దానిని సగం మంది విమర్శిస్తుంటారని, అయితే తాము పడిన కష్టాన్ని గుర్తించి, ఇలాంటి కొత్త కథలను ప్రోత్సహించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల కూడా మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు మంచి కథలను ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ సినిమా తీశామని, కానీ కొందరు మంచి కంటెంట్‌ను విస్మరించి తప్పులు వెతకడంపైనే దృష్టి సారిస్తున్నారని అన్నారు. ముఖం కనిపించని పాత్రలో నటించేందుకు ఒప్పుకున్న అనుపమ ధైర్యం గొప్పదని, ఈ సినిమాతో ఆమెకు జాతీయ అవార్డు రావాలని ఆకాంక్షించారు.