‘అందంగా కనిపించేందుకు రకరకాల దుస్తులు ధరిస్తుంటాం. ఎన్ని రకాల దుస్తులు ధరించినా.. చీర ఇచ్చే అందం మరేవీ ఇవ్వలేవు’ అని ఖరాఖండీగా చెప్పేసింది మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. రీసెంట్గా చీరకట్టులో అందంగా నవ్వుతూ కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అనుపమ పై విధంగా స్పందించింది. ఇంకా చెబుతూ ‘గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నాను కనుక.. కొత్తదనం కోసం మోడ్రన్ డ్రెస్‌లు ధరిస్తాను తప్ప.. నిజానికి ఆ తరహా దుస్తులపై నాకంత ఆసక్తి ఉండదు.
చిన్నప్పట్నుంచీ చీర అంటేనే నాకిష్టం. స్త్రీలోని స్వాభిమానం, గంభీరత, సౌందర్యం, శారీరక సోయగం.. ఇవన్నీ ప్రస్ఫుటంగా కనిపించేది చీరలోనే. చీర ఇచ్చేంత అందాన్ని ఒక స్త్రీకి మరే దుస్తులూ ఇవ్వవు. చీర ఎంత అందమైనదైనా.. కట్టు సరిగ్గా ఉండాలి. అసలు సరిగ్గా కట్టుకుంటే ఏ చీర అయినా అందంగానే ఉంటుంది. ఈ విషయంలో మా అమ్మకు థాంక్స్ చెబుతాను. ఎందుకంటే నాకు చీరకట్టడం నేర్పింది మా అమ్మే’ అని చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్.