హృదయాన్ని కదిలించే ప్రేమకథా చిత్రాల రూపకల్పన ఇప్పుడు బాగా తగ్గిపోయిందని, అందుకు కాలానుగుణంగా వచ్చిన మార్పులే కారణమని అన్నారు సీనియర్ నటుడు అనుపమ్‌ఖేర్. ప్రేక్షకులు స్వచ్ఛమైన రొమాంటిక్ స్టోరీని ఆస్వాదించి చాలా కాలమైందని వ్యాఖ్యానించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘మెట్రో..ఇన్ డినో’ త్వరలో విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమకాలీన సినిమాపై ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
‘ఒకప్పుడు ప్రేమలో పడటం, దానిని వ్యక్తం చేయడం ఓ అందమైన అనుభవంలా అనిపించేది. కానీ ఇప్పుడలా కాదు. ప్రేమలో పడిపోవడం, ఆ తర్వాత కొద్దిరోజులకే శారీరకంగా దగ్గరకావడం, ఆపై వెంటనే పెళ్లాడటం.. ఈ ప్రక్రియ చకచకా జరిగిపోతున్నది. దీనిని నేను తప్పనను. ఎందుకంటే నేటి సమాజాన్నే సినిమాలు ప్రతిబింబిస్తున్నాయి’ అని అనుపమ్‌ఖేర్ చెప్పుకొచ్చారు.
క్లాసిక్ లవ్‌స్టోరీగా నిలిచిన షారుఖ్‌ఖాన్ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రాన్ని ఈరోజుల్లో తీసివుంటే పెద్ద ఫ్లాప్‌గా నిలిచేదని, అప్పటి తరానికి అదొక కొత్త కథ అని అనుపమ్ ఖేర్ అభిప్రాయపడ్డారు. అయితే తరానికి అనుగుణంగా ప్రేమ భావనల్లో మార్పులు రావడం సహజమని, వాటిని అంగీకరించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.