‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో తాను పోషించిన దుర్గ పాత్ర వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పింది అనూ ఇమ్మాన్యుయేల్. రష్మిక మందన్న, దీక్షిత్‌శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె సినిమా సంగతులను పంచుకుంది. అమ్మాయిల కోణంలో ఓ మంచి విషయాన్ని చెప్పే సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉందని పేర్కొంది. తమిళ, తెలుగు భాషల్లో చాలా మంది అగ్ర హీరోలతో కలిసి నటించానని, అయితే కెరీర్లో కొన్ని సినిమాలు చేసి ఉండాల్సింది కాదని రిగ్రీట్గా ఫీలవుతున్నానని అనూ ఇమ్మాన్యుయెల్ తెలిపింది. ‘అలాంటి సినిమాల్లో నాలుగు పాటలు, డ్యాన్స్‌లతో పాటు ఏవో డైలాగ్‌లు చెప్పిస్తారు. అవన్నీ రొటీన్‌గా అనిపిస్తాయి. ఇకపై అలాంటి సినిమాలు చేయొద్దని నిర్ణయించుకున్నా.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ లాంటి సినిమాల వల్ల కొత్తగా ఏమైనా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. దుర్గ పాత్రకు నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పాను. దాంతో ఆ క్యారెక్టర్ మరింత నేచురల్‌గా స్క్రీన్‌పై కనిపించింది. సినిమాలోని కొన్ని సీన్స్‌కు అబ్బాయిలు క్లాప్స్ కొడుతున్నారు’ అని అనూ ఇమ్మాన్యుయేల్ చెప్పింది. కెరీర్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నానని, అవకాశాల కోసం ఆరాటపడే తత్వం తనది కాదని, కెరీర్లో అడుగుపెట్టిన దగ్గరి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నానని ఆమె పేర్కొంది. ప్రస్తుతం కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని, ఆ వివరాలను త్వరలో తెలియజేస్తానని అనూ ఇమ్మాన్యుయేల్ చెప్పింది.