మిరాజ్
సోనీ లివ్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, హకీమ్ షాజహాన్, హన్నా రెజీ కోషి, సంపత్ రాజ్, శరవణన్ తదితరులు, దర్శకత్వం: జీతూ జోసెఫ్
అనూహ్యమైన మలుపులతో కథను నడిపించడంలో మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ సిద్ధహస్తుడు. కొత్తదనానికి ప్రాధాన్యమిస్తూనే.. ట్విస్టుల మీద ట్విస్టులతో సినిమా ఆసాంతం ఊపిరిబిగబట్టి చూసేలా చేస్తాడు. ఇప్పటికే దృశ్యం, దృశ్యం-2, నెరు సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా, ‘మిరాజ్’ అంటూ మరో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల మీదికి వదిలాడు. సెప్టెంబర్‌లో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా.. ఇటీవలే ‘సోనీ లివ్’లో స్ట్రీమింగ్కు వచ్చింది. రికార్డ్ వ్యూస్ సాధిస్తూ.. ఇక్కడా హిట్ టాక్ తెచ్చుకున్నది.
కథలోకి వెళ్తే.. రాజశేఖర్ (శరవణన్) అనే వ్యాపారికి చెందిన సంస్థలో అభిరామి (అపర్ణ బాలమురళి) పనిచేస్తుంటుంది. అక్కడే పనిచేస్తున్న కిరణ్ (హకీమ్ షాజహాన్)తో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే, కిరణ్ అంత నమ్మకస్తుడు కాదంటూ అభిరామి స్నేహితురాలు రీతూ చెబుతుంటుంది. ఆమె మాటలను పట్టించుకోని అభిరామి.. కిరణ్‌తో పెళ్లివైపు అడుగులు వేస్తుంది. ఇలా ఉండగా, రైలు ప్రమాదంలో కిరణ్ చనిపోయాడని తెలిసి అభిరామి షాక్‌కు గురవుతుంది. కిరణ్ వస్తువులను గుర్తించిన అభిరామి.. మృతదేహం గుర్తుపట్టలేనంతగా దెబ్బతినడంతో చూడలేకపోతుంది.
కిరణ్ జ్ఞాపకాల నుంచి బయటపడటానికి రీతూ ఇంటికి వస్తుంది. కిరణ్ మృతిపై అనుమానంతో ఎస్పీ ఆర్ముగం (సంపతేజ్) కూడా విచారణ మొదలు పెడతాడు. మరోవైపు.. ఆన్లైన్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అశ్విన్ (ఆసిఫ్ అలీ) ఓ హార్డ్‌డిస్క్ గురించి అభిరామిని సంప్రదిస్తాడు. ఆమె తనకేమీ తెలియదని చెబుతుంది. ఆ తర్వాత రాజశేఖర్ మనుషులు కూడా అదే హార్డ్‌డిస్క్ గురించి అభిరామిని బెదిరిస్తారు. దాన్ని పోలీసులకు ఇచ్చినా, మీడియావాళ్లకు ఇచ్చినా.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తారు. దాంతో అశ్విన్‌తో కలిసి ఆ హార్డ్‌డిస్క్ కోసం వేట మొదలుపెడుతుంది అభిరామి. ఇంతకీ.. ఆ హార్డ్‌డిస్క్‌లో ఏముంది? రాజశేఖర్, పోలీసులు దానికోసం ఎందుకు వెతుకుతున్నారు? ఈ వ్యవహారంలో అభిరామికి అశ్విన్ చేసిన సాయం ఏంటి? అసలు కిరణ్ చనిపోయాడా? బతికే ఉన్నాడా? ఈ క్రమంలో అభిరామి ఎదుర్కొనే పరిణామాలు ఏంటి? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానమే.. మిరాజ్!