Anna Lezhneva | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఏడాది క్రితం జరిగిన విషాద ఘటనను మరోసారి గుర్తు చేసుకుంటూ ఆయన భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలో భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. 2025 ఏప్రిల్ 8న సింగపూర్‌లో మార్క్ శంకర్ చదువుకుంటున్న పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలగడంతో ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స పొందాడు. ఆ సమయంలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండగా, వైద్యుల కృషితో అతను క్రమంగా కోలుకున్నాడు. అయితే ఆ ఘటన ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని, ఇప్పటికీ చికిత్స కొనసాగుతూనే ఉందని అన్నా వెల్లడించారు.
తాజాగా ఆ రోజు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అన్నా లెజినోవా తన పోస్ట్‌లో భావోద్వేగంగా స్పందించారు. “ఈ రోజు మా కుటుంబానికి ఎంతో భావోద్వేగభరితమైన రోజు. ఇదే రోజు అకిరా పుట్టినరోజు కూడా. అతను ఎంతో తెలివైన, దయగల పిల్లవాడు. అలాగే, మా చిన్న కుమారుడు మార్క్ ప్రాణాలకు ముప్పు తెచ్చిన ఆ అగ్నిప్రమాదం జరిగి నేటికి కచ్చితంగా ఒక సంవత్సరం పూర్తైంది” అని ఆమె పేర్కొన్నారు. మార్క్‌కు ఇది రెండో పుట్టినరోజు లాంటిది. దేవుడి దయవల్ల అతను బ్రతికాడు. కానీ అతని ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. అతను ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న దృశ్యం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏ తల్లి కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదు అంటూ తన మనసులోని బాధను పంచుకున్నారు.
అగ్నిప్రమాదంలో మరికొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ, వారి కుటుంబాలపై సానుభూతి వ్యక్తం చేశారు. ఆ ఘటనకు బాధ్యులు ఎవరో ఇప్పటికీ తెలియదు. కొందరు పిల్లలు ఇంకా శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. వారి గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ ప్రమాద సమయంలో ప్రాణాల్ని పణంగా పెట్టి పిల్లలను రక్షించిన నిర్మాణ కార్మికుల ధైర్యాన్ని కూడా ఆమె కొనియాడారు. “అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు 15 మంది పిల్లలను కాపాడిన ఆ కార్మికులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ కృతజ్ఞతలు తెలిపారు. చివరగా ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇచ్చారు. “ప్రతి ఇంట్లో అగ్నిమాపక పరికరం లేదా ఫైర్ బ్లాంకెట్ తప్పనిసరిగా ఉండాలి. అది ఉపయోగించే పరిస్థితి ఎప్పటికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను” అంటూ సేఫ్టీపై అవగాహన కల్పించారు.