Anna Lezhneva | ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఇటీవల సైనస్ శస్త్రచికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వ్యక్తిగతంగా తెలుసుకోవడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో జరిగిన పలు అధికారిక కార్యక్రమాల అనంతరం ప్రధాని మోదీ నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు కొంతసేపు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య అన్నా లెజినోవా, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రధాని మోదీ పవన్ కుటుంబంతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ, ముందు ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాతే తిరిగి పనుల్లోకి రావాలి అని పవన్‌కు ప్రధాని సూచించారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అన్నా లెజినోవా ప్రత్యేక పోస్టు పెట్టడం ఇప్పుడు మరింత వైరల్ అవుతోంది. ప్రధాని మోదీతో దిగిన ఫోటోలను షేర్ చేసిన ఆమె, తన భర్త ఆరోగ్యంపై ప్రధాని ప్రత్యేక శ్రద్ధ చూపారని పేర్కొన్నారు. ముందుగా ఆరోగ్యంపై ఫోకస్ చేయాలని, పూర్తిగా కోలుకున్నాకే తిరిగి పని ప్రారంభించాలని ప్రధాని మోదీ నా భర్తకు చెప్పారు. అలాగే ఆయన నన్ను చూసి.. ‘మీ భర్తను జాగ్రత్తగా చూసుకోండి’ అని అన్నారు. నేను అది ఎంతో సంతోషంగా చేస్తున్నాను. నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధాని మోదీకి ప్రామిస్ చేశాను అంటూ అన్నా లెజినోవా తన పోస్టులో రాసుకొచ్చారు.
అన్నా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆమె పోస్టుపై స్పందిస్తూ పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండగా, ఆరోగ్య సమస్యల కారణంగా కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయంలో ప్రధాని స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించడం పవన్ కుటుంబానికి ప్రత్యేకంగా మారింది.