ప్రస్తుతం విజయ్‌దేవరకొండతో ‘కింగ్డమ్’ వంటి భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఇదే బ్యానర్లో గౌతమ్ తిన్ననూరి ‘మ్యాజిక్’ పేరుతో ఓ మ్యూజికల్ డ్రామాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ స్వరకర్త. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ‘డోంట్ నో వై’ అనే గీతాన్ని విడుదల చేశారు. ప్రేమ, భావోద్వేగాల కలబోతగా చక్కటి విజువల్స్‌తో ఈ పాట సాగింది.
కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని అనిరుధ్, ఐశ్వర్య సురేష్ ఆలపించారు. తమ కళాశాల ఉత్సవం కోసం ఓ పాటను స్వరపరచడానికి నలుగురు యువకులు చేసే ప్రయత్నం నేపథ్యంలో ఈ చిత్ర కథ నడుస్తుందని, వారి మ్యూజికల్ జర్నీ భావోద్వేగాల్ని పంచుతుందని చిత్ర బృందం పేర్కొంది. సారా అర్జున్, అన్మోల్ కజాని, ఆకాష్ శ్రీనివాస్, సిద్ధార్థ్ తణుకు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గిరీష్ గంగాధరన్, ఆర్ట్: అనినాష్ కొల్లా, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, రచన-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి.