‘సైయారా’తో బాలీవుడ్లో అరంగేట్రం చేసి యువప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది నాజూకు అందాల సోయగం అనీత్ పడ్డా. ఈ సినిమాలో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ భామకు బాలీవుడ్లో భారీ అవకాశాలొస్తున్నాయి. తాజాగా ఈ సొగసరి మాడాక్ ఫిల్మ్స్‌లోని హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగం కాబోతున్నది. ఇప్పటికే ఈ ప్రొడక్షన్ హౌస్ స్త్రీ, రూహీ, భేడియా,థామా వంటి హారర్ కామెడీ చిత్రాలతో హిందీ చిత్రసీమలో ప్రత్యేకతను చాటుకుంటున్నది.
మాడాక్ ఫిల్మ్స్ నిర్మించనున్న తదుపరి చిత్రం ‘శక్తిశాలిని’లో అనీత్ పడ్డా టైటిల్ రోల్‌ని పోషించనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది.
‘సైయారా’ వంటి హృద్యమైన ప్రేమకథా చిత్రం తర్వాత అనీత్ పడ్డా ప్రతిష్టాత్మక హారర్ ఫ్రాంఛైజీలో ఛాన్స్ దక్కించుకోవడం ఆమె కెరీర్లో కీలకమైన మలుపు అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలంటున్నాయి. తొలుత ఈ చిత్రంలో కియారా అద్వాణీని నాయికగా అనుకున్నారు. డేట్స్ సమస్య వల్ల ఆమె అందుబాటులో లేకపోవడంతో చివరకు బాలీవుడ్ లేటెస్ట్ యూత్ సెన్సేషన్ అనీత్ పడ్డాను ఖరారు చేసింది చిత్రబృందం.