Ande Sri | నిరక్షరాస్యుడి నుండి జాతి గేయకర్తగా ఎదిగిన మహామనిషి,ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో సాహిత్యరంగం, సాంస్కృతిక వర్గాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో విషాదం నెలకొంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగారు. తొలినాళ్లలో గొర్రెలు, పశువులు కాయడం చేశారు . చదువుకూ అక్షరానికీ దూరంగా ఉన్నప్పటికీ, పల్లెటూరి ప్రకృతి, ప్రజల బాధలు ఆయనలో కవిత్వాన్ని మేల్కొలిపాయి. పక్షుల కిలకిలారావం, వాగుల జలపాతం, మట్టివాసన ఇవన్నీ ఆయనకు గురువుగా మారాయి.
తాపీ పని నేర్చుకునేందుకు నిజామాబాద్ వెళ్లినప్పుడు శృంగేరి మఠ స్వామి శంకర్ మహారాజ్ ఆయన ఆశువుగీతాలు విని ఆశ్చర్యపోయి, ప్రేమగా “నీవు శ్రీతో సమానుడివి” అంటూ ఆయన పేరును ‘అందెశ్రీ’ గా మార్చారు. ఆ పేరు జీవితాంతం ఆయనకు గుర్తింపుగా నిలిచింది. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు”, “కొమ్మ చెక్కితే బొమ్మరా” వంటి పాటలు ఆయనను తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రజాకవిగా నిలబెట్టాయి. పదజాలం కంటే భావోద్వేగమే బలమైన ఆయన కవిత్వం, తెలంగాణ నేల యొక్క ఆత్మను ప్రతిబింబించింది. ఆయన రూపకల్పన చేసిన “ధూంధాం” కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ మేల్కొలిపింది. ఆయన రచించిన “జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం” గీతం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తింపు పొందింది. ఏనాడూ బడి మెట్టెక్కకపోయినా, అక్షరముక్క కూడా రాకపోయినా అందెశ్రీ తన సహజసిద్ధమైన ప్రతిభతో సాహిత్యరంగంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రకృతి వంటి అంశాలపై ఆయన రాసిన గేయాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ముఖ్యంగా, నారాయణ మూర్తి సినిమాల ద్వారా ఆయన పాటలు విప్లవాత్మక విజయాలు సాధించాయి. పల్లెనీకు వందనములమ్మో’,’గలగల గజ్జెలబండి’, ‘కొమ్మ చెక్కితే బొమ్మరా…’,’జన జాతరలో మన గీతం’, ‘యెల్లిపోతున్నావా తల్లి’ వంటి పాటలు అనే గీతాలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. అప్పటికప్పుడే కవిత్వం చెప్పగలిగే అశువు కవిత్వం చెప్పటంలో అందెశ్రీ దిట్ట. ఆయన సినీ రంగంలో కూడా తనదైన ముద్ర వేసారు. ‘గంగ’ సినిమాకు గానూ 2006లో నంది పురస్కారం అందుకున్నారు. అలాగే ‘బతుకమ్మ’ సినిమా కోసం పాటలతో పాటు సంభాషణలు కూడా రాయడం జరిగింది. అందెశ్రీ లేరు… కానీ ఆయన కవిత్వం తెలంగాణ నేలపై ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది.