‘నాకు ప్రకృతి, పర్యావరణం అంటే ఎంతో మక్కువ. ఎలాంటి సినిమా తీసినా అందులో సామాజిక ప్రయోజం ఉండాలని కోరుకుంటా. ఇకముందు కూడా సమాజానికి ఉపయుక్తమయ్యే సినిమాలే చేస్తాను’ అన్నారు నిర్మాత రాజేందర్ రెడ్డి. ప్రముఖ దర్శకుడు సంపత్‌నందితో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘సింబా’ ఈ నెల 9 ప్రేక్షకుల ముందుకొస్తున్నది. జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించారు. మురళీమనోహర్ దర్శకుడు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత రాజేందర్ రెడ్డి పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
25 ఏళ్ల క్రితం నేను జర్నలిస్ట్‌గా పనిచేశాను. సామాజిక దృక్పథంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. కరోనా సమయంలో సంపత్‌నంది ఈ కథ చెప్పారు. ఈ కాన్సెప్ట్‌లోని పర్యావరణ పరిరక్షణ నేపథ్యం, సైంటిఫిక్ ఫాంటసీ అంశాలు బాగా ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. ‘సింబా’ అంటే అడవికి రారాజు. అమ్మవారికి వాహనం. ఇందులో కథానాయకుడు అడవిని కాపాడే వ్యక్తిగా కనిపిస్తాడు. కథానుగుణంగానే ఈ టైటిల్ పెట్టాం.
ప్రస్తుతం మనం కాలుష్య వాతావరణంలో నివసిస్తున్నాం. ప్రకృతి, పర్యావరణం మీద చాలా మందికి అవగాహన ఉండటం లేదు. ఇలాంటి విషయాల పట్ల మరింత జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవశ్యకత ఉందని ఈ సినిమా ద్వారా తెలియజెప్పాం. సంపత్‌నంది సైంటిఫిక్ ఫాంటసీ థ్రిల్లర్‌గా కథను తీర్చిదిద్దారు. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. సెన్సార్‌వారు కూడా సినిమా బాగుందని అభినందించారు.
ఈ సినిమా చూశాక పర్యావరణం పట్ల కొంతమందిలోనైనా మార్పు వస్తే అదే విజయంగా భావిస్తాం. మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌గారు టీజర్ చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యారు. మా టీంను పిలిచి అభినందించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో సహకరించింది. ‘సింబా’ చిత్రాన్ని ఉభయ తెలుగు రాష్ర్ర్టాల్లో 200 థియేటర్లలో విడుదల చేస్తున్నాం.