Anasuya | టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ నటిగా కొనసాగుతున్నారు. యాంకర్‌గా వచ్చిన గుర్తింపును నటిగా విజయవంతంగా మలుచుకున్న అనసూయ, ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఒక బాధాకర సంఘటనను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కెరీర్ ప్రారంభంలో క్షణం, సోగ్గాడే చిన్ని నాయన వంటి చిత్రాల్లో అవకాశాలు రావడంతో నటిగా మంచి గుర్తింపు లభించిందని తెలిపారు.
అయితే ఆమె కెరీర్లో నిజమైన మలుపు మాత్రం రంగస్థలం సినిమా ద్వారా వచ్చిందని చెప్పాలి. ఈ చిత్రంలో ఆమె పోషించిన ‘రంగమ్మత్త’ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా ఘన విజయం సాధించడంతో అనసూయకు నటిగా డిమాండ్ మరింత పెరిగింది. అయితే విజయాలతో పాటు వివాదాలు, సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా తన జీవితంలో భాగమయ్యాయని అనసూయ తెలిపారు. తనపై జరిగే విమర్శలకు, ట్రోల్స్‌కు అవసరమైనప్పుడు గట్టిగానే సమాధానం ఇస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్లో జరిగిన ఒక బాధాకరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. “ఒక సమయంలో మూడు క్రేజీ సినిమాల కోసం నన్ను ముందుగా ఎంపిక చేశారు. కానీ తర్వాత ఎలాంటి కారణం చెప్పకుండా ఆ ప్రాజెక్టుల నుంచి నన్ను తొలగించారు. ఎందుకు తీసేశారు? ఏం జరిగింది? అన్న విషయంపై కనీస వివరణ కూడా ఇవ్వలేదు” అని అన్నారు.
ఆ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని అనసూయ వెల్లడించారు. “ఆ రోజు రాత్రి చాలా బాధేసింది. అర్థరాత్రి రెండు గంటల సమయంలో భర్త దగ్గర కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేశాను. ఆ బాధను జీర్ణించుకోలేకపోయాను” అని చెప్పారు. అలాగే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలపై కూడా సోషల్ మీడియాలో అనవసర చర్చలు జరిగాయని ఆమె తెలిపారు. నేను అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాను. కానీ పరిమితంగానే తీసుకుంటాను. ఆ విషయాన్ని కూడా కొందరు వివాదంగా మార్చి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు అని పేర్కొన్నారు. అయితే ట్రోలింగ్ గురించి పెద్దగా పట్టించుకోనని, కాలక్రమంలో అలాంటి విషయాలను ఎదుర్కోవడం నేర్చుకున్నానని అనసూయ స్పష్టం చేశారు. “ఎవరు ఏమనుకున్నా, ఎన్ని ట్రోల్స్ చేసినా చివరికి నేను నా పనిని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను” అని ధైర్యంగా చెప్పారు.