ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రానికి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘90S’ వెబ్‌సిరీస్ ఫేం ఆదిత్యహాసన్ ఈ చిత్రానికి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ని జరిగింది. ‘శేఖర్ కమ్ముల సినిమాలో హీరో లాంటి అబ్బాయికి, సందీప్‌రెడ్డి వంగా సినిమాలో హీరో లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అని గ్లింప్స్‌లో వినిపిస్తున్న సంభాషణ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఇందులోని ఆదిత్య పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. కాస్తంత బిడియస్తుడు, మొహమాటస్తుడూ అయిన ఆదిత్య అమ్మానాన్నల ఒత్తిడి వల్ల లండన్‌కి వెళ్తే.. అక్కడ ఏం జరిగింది?
అనేదే ఈ సినిమా కథ. తెలుగులో వస్తున్న పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. లండన్‌లో జరిగే కథ అయినా మన ఇంట్లో జరిగే కథలానే ఉంటుంది.’ అని తెలిపారు. జీవితంలో అందరూ దాటి వచ్చిన అందమైన జ్ఞాపకాలను గుర్తు చేసేలా సినిమా ఉంటుందని వైష్ణవి చైతన్య చెప్పారు. ‘మన చుట్టూ జరిగే చిన్న కథలను తీసుకొని, వాటిని అందంగా తెరపైకి తీసుకురావడం నాకిష్టం. నేను ఇప్పటివరకూ ఏం చేసినా నమ్మే చేశాను. ఈ ‘ఎపిక్’ సినిమాను కూడా నమ్మి చేస్తున్నాను. ఇదో మధ్య తరగతి కుర్రాడి ప్రేమకథ’ అని ఆదిత్యహాసన్ పేర్కొన్నారు. ఈ సినిమాకు కొనసాగింపు కూడా ఉంటుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అజీమ్ మహమ్మద్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.