‘దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు..నా కథ నాకే చెప్పాడా అనిపించింది. ఎందుకంటే నేను విదేశాల్లో చదువుకున్నా. అందుకే చాలా సన్నివేశాలు నాకు కనెక్ట్ అయ్యాయి. ఇందులోని కుటుంబ అనుబంధాలు, ప్రేమ, భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. లండన్ నేపథ్యంలో నడిచే ఆధునిక ప్రేమకథగా టీజర్ ఆకట్టుకుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఓ జంట ప్రేమ ప్రయాణానికి అద్దం పడుతూ ఆసక్తికరంగా సాగింది.
ఆదిత్యహాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరికి ఈ కథ మనదే కదా అనే భావనను కలిగిస్తుందన్నారు. ఈ వేసవిలో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని దర్శకుడు ఆదిత్యహాసన్ తెలిపారు. ఇదొక అందమైన, మనసుకు దగ్గరైన ప్రేమకథ అని కథానాయిక వైష్ణవి చైతన్య చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, రచన-దర్శకత్వం: ఆదిత్యహాసన్.