Deepika Padukone | బాలీవుడ్లో షారుఖ్, దీపికా పడుకోన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ చిత్రసీమలో హిట్‌పెయిర్‌గా వారికి గుర్తింపు ఉంది. ఇప్పటివరకు వీరిద్దరు కలిసి ఐదు చిత్రాల్లో నటించగా..అవన్నీ సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. తాజాగా ఈ జోడీ ‘కింగ్’ సినిమాలో నటించనుంది. షారుఖ్‌ఖాన్ తనయ సుహానా ఖాన్ ప్రధాన పాత్ర లో రూపొందుతున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సుహానాఖాన్ గురువు పాత్రలో షారుఖ్‌ఖాన్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాలో దీపికా పడుకోన్ అతిథి పాత్రలో నటిస్తుందంటూ వార్తలొచ్చాయి. అవన్నీ పుకార్లేనని చిత్రబృందం కొద్ది వారాల క్రితం వివరణ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం దీపికా పడుకోన్ ఈ సినిమాలో భాగం కానుందని తెలిసింది. తొలుత ఈ సినిమా కోసం ‘కింగ్’ టీమ్ తనను సంప్రదించినప్పుడు దీపికా పడుకోన్ సున్నితంగా తిరస్కరించిందట.
ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌కు సమయాన్ని కేటాయించాల్సి ఉందని, కొత్త సినిమాలు సైన్ చేయలేనని చెప్పిందట. ఆ తర్వాత అతిథి పాత్ర కోసం కత్రినాకైఫ్, సోనమ్ బజ్వా, ప్రీతిజింటా వంటి తారల్ని సంప్రదించారు. వారు కూడా పలు కారణాలతో ఒప్పుకోక పోవడంతో చివరకు షారుఖ్‌ఖాన్ రంగంలో దిగారు. దీపికా పడుకోన్‌ను ఫోన్లో సంప్రదించిన షారుఖ్‌ఖాన్ ఎలాగైనా అతిథి పాత్రలో నటించాలని అభ్యర్థించారట. ఆమె డేట్స్ కోసం అవసరమైతే షూటింగ్ షెడ్యూల్స్‌ను మార్చుతామని హామీ ఇచ్చారట. షారుఖ్ రిక్వెస్ట్ మేరకు చివరకు దీపికా సినిమాకు ఓకే చెప్పిందని బాలీవుడ్ టాక్. ఈ సినిమాను మేలో మొదలుపెట్టి ఆగస్ట్‌లోగా పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. అయితే దీపికా పడుకోన్ కాల్షీట్స్ అక్టోబర్‌లో అందుబాటులో ఉండటంతో అప్పటి వరకు వేచిచూడాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారని బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్.