Anajali | ప్రముఖ టీవీ నటి అంజలి పవన్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి ఇటీవల కన్నుమూశారు. ఈ విషాదకర వార్తను అంజలి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తల్లి కోల్పోయిన బాధను జీర్ణించుకోలేక భావోద్వేగంతో కూడిన పోస్ట్ షేర్ చేశారు. “అమ్మా… నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేను. నీ నవ్వు, నీ మాటలు, నీవిచ్చిన ప్రేమ ఇవన్నీ ఇక జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. కాలం నిన్ను మా నుంచి దూరం చేసినా, మా హృదయం మాత్రం నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు. నీ ఆశీస్సుల వెలుగు ఎల్లప్పుడూ మా జీవితాలను దారి చూపిస్తుంది. అమ్మా… నీ ఆత్మకు శాంతి కలగాలి” అంటూ అంజలి ఎమోషనల్ పోస్ట్ చేశారు” అంటూ ఆమె రాసిన పోస్ట్ నెటిజన్ల మనసులను తాకింది.
ఈ వార్త తెలుసుకున్న పలువురు టీవీ, సినిమా సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు సంతాపం తెలియజేస్తూ, “ఓం శాంతి” అని స్పందిస్తున్నారు. గత కొన్ని నెలలుగా అంజలి తల్లి ఆరోగ్యం బాగోలేదని, ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అంజలే ఒకసారి వివరించారు. ఆమె లంగ్స్ కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయింది. చాలాకాలం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. డిశ్చార్జ్ అయిన తరువాత మళ్లీ కిందపడిపోయారు. హిప్ బోన్ విరిగింది. మళ్లీ హాస్పిటల్‌కి వెళ్లాల్సి వచ్చింది” అంటూ అంజలి గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత హృదయ విదారకంగా మారాయి.
అంజలి టెలివిజన్ రంగంలో రాధా కళ్యాణం, మొగలిరేకులు, శివరంజని, దేవత వంటి హిట్ సీరియల్స్‌లో లీడ్ రోల్స్‌తో పాటు విలన్ పాత్రల్లోనూ నటించి గుర్తింపు పొందారు. ఆమె ‘నీతోనే డ్యాన్స్’ వంటి షోలలోనూ పాల్గొన్నారు. ప్రారంభంలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అంజలి, నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అంజలి భర్త సంతోష్ పవన్ కూడా ప్రముఖ టీవీ నటుడు. వీరి కూతురు ధన్విక (చందమామ) యూట్యూబ్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్నవయసులోనే యూట్యూబ్ వీడియోలతో పిల్లలలో మంచి క్రేజ్ సంపాదించింది. మరోవైపు అంజలి త్వరలోనే మరో బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఇటీవలే తన సీమంతం వేడుకగా జరగగా, ఈ వేడుకకి బుల్లితెర, సినిమా సెలబ్రెటీలు ఎంతోమంది వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేసి సంతోషంగా ఉన్నసమయంలో తల్లిని కోల్పోవడం అందరిని బాధిస్తుంది. తన అమ్మే తన కూతురిగా మరోసారి పుట్టాలంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.