తనదైన కామెడీ టైమింగ్‌తో చక్కటి హాస్యాన్ని పండిస్తారు నవీన్ పొలిశెట్టి. ‘జాతిరత్నాలు’ ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలతో కావాల్సినంత వినోదాన్ని పంచిన ఆయన మరోమారు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒకరాజు’. మీనాక్షి చౌదరి కథానాయిక. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు.
ఆభరణాల స్ఫూఫ్‌తో ఆరంభమైన టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. కోనసీమ నేపథ్యంలో కామెడీ, రొమాన్స్ అంశాల కలబోతగా ఆకట్టుకుంది. సంక్రాంతి పండగకు ప్రేక్షకులు కోరుకునే అసలైన వినోదాన్ని అందించే చిత్రమిదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్, సంగీతం: మిక్కీ జే మేయర్, నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, దర్శకత్వం: మారి.