Anaganaga Oka Raju | టాలీవుడ్లో ఈ తరం యంగ్ హీరోల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి. స్టార్ ఇమేజ్ కంటే కథ బలం, వినోదమే తన ఆయుధంగా ముందుకెళ్లే నవీన్… ప్రతి సినిమాతో తన పరిధిని విస్తరించుకుంటూ ప్రేక్షకుల మనసుల్లో స్థిరమైన స్థానం సంపాదించుకుంటున్నారు. ‘జాతి రత్నాలు’తో కామెడీ హీరోగా బలమైన ముద్ర వేసిన ఆయన, ఆ తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా తనవైపు తిప్పుకున్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఏంటో చూపించారు. జనవరి 14న విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. క్లీన్ కామెడీతో నవ్వులు పూయిస్తూ, చివర్లో భావోద్వేగాలకు చోటిచ్చిన ఈ సినిమా… “ఇదే అసలైన పండగ సినిమా” అనే టాక్‌ను సంపాదించుకుంది.
కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు సంతృప్తిగా బయటకు రావడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌గా మారింది. కొత్త దర్శకుడు మారి కథను ఎక్కడా లాగకుండా, సరైన పేస్‌తో తెరకెక్కించాడని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రన్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. విడుదలైన తొలి రోజే రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి గట్టి ఆరంభం చేసింది. ఆ తర్వాత మూడు రోజుల్లోనే రూ.61 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రోజుకు సగటున రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ, సంక్రాంతి సెలవుల్లో స్ట్రాంగ్‌గా నిలిచింది. ఈ జోరు చూస్తే సెలవులు ముగిసేలోపు రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ ‘అనగనగా ఒక రాజు’కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో భారీ ఆక్యుపెన్సీతో షోలు నడుస్తుండగా, మొదటి వారాంతం ముగిసేలోపు 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. దీంతో ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘అనగనగా ఒక రాజు’తో వరుసగా మూడు సినిమాలు 1 మిలియన్ డాలర్ క్లబ్‌లోకి తీసుకెళ్లిన యంగ్ హీరోగా నవీన్ అరుదైన రికార్డు సృష్టించారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి గ్లామర్‌తో పాటు నటనలోనూ ఆకట్టుకుంది. నవీన్‌తో ఆమె కెమిస్ట్రీ కథకు అదనపు ఆకర్షణగా నిలిచింది. మిక్కీ జె మేయర్ సంగీతం సినిమాకు ప్రాణంగా మారగా, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కథలో ముంచేశాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రం నిర్మాణ విలువల పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది.