Amitabh Bachchan |బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్‌ను ఎవరూ ఉపయోగించరాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమితాబ్ బచ్చన్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని ఐటీ శాఖ అధికారులు, టెలికాం సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది.
వాణిజ్యపరమైన కార్యక్రమాల్లో తన అనుమతిలేకుండా పేరు, ఫొటో, వాయిస్ ఉపయోగిస్తున్నారని.. వ్యక్తిగత లక్షణాలు ఉపయోగించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ బిగ్‌బీ నేడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమితాబ్ తరఫున న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. కొన్ని సంస్థలు టీ-షర్టులు తయారు చేసి వాటిపై అమితాబ్ ఫొటోలు వేస్తున్నారని.. మరికొందరు పోస్టర్లు విక్రయిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. మరికొందరైతే ఏకంగా అమితాబ్‌బచ్చన్.కామ్ అంటూ డొమైన్ క్రియేట్ చేసి వెబ్సైట్ కూడా పెట్టేస్తున్నారని సాల్వే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
సాల్వే వాదనలపై స్పందించిన న్యాయస్థానం.. అమితాబ్ బచ్చన్ అనుమతి లేకుండా ఆయన సెలబ్రిటీ హోదాను ఉపయోగించరాదని తెలిపింది. ఫొటోలు, పేరు, వాయిన్‌ను ఏ వ్యక్తి గానీ, సంస్థ కానీ వాడకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.