కొందరు బతకడం కోసం పనిచేస్తారు. కొందరు పనిచేయడం కోసమే బతుకుతారు. రెండో రకానికి చెందిన వ్యక్తి బిగ్‌బీ అమితాబ్. 81ఏళ్ల వయసులో తను చేయడానికి పని దొరుకుతున్నందుకు ఆనందిస్తున్నారాయన. ఈ వయసులో ఇంకా బిజీగా పనిచేస్తుండటంపై తాజాగా తన బ్లాగ్‌లో స్పందించారు అమితాబ్. ‘మీకు వయసు అయిపోయింది. ఈ వయసులో కూడా అతిగా పనిచేయడం అవసరమా? రెస్ట్ తీసుకోవచ్చుకదా! అని చాలామంది నాకు సలహాలిస్తూ ఉంటారు. వారికి చెప్పేదొక్కటే. ఇప్పటికీ పని చేస్తున్నానంటే కారణం.. నాకు పని దొరకడమే. అంతకంటే వేరే కారణం ఏమీలేదు. పని దొరుకుతుంది కాబట్టే చేస్తున్నా. మరి నా పని మీకేమైనా సమస్యగా ఉందా? లేదు అనుకుంటే, వెళ్లి మీ పని మీరు చూసుకోండి. నేనెందుకు పని చేస్తున్నానో అర్థమవుతుంది.’ అంటూ చెప్పుకొచ్చారు బిగ్‌బీ. ఆయన కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.