Amitabh Bachchan |ఇటీవల ఫ్యాన్స్ అత్యుత్సాహంతో సెలబ్రిటీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిధి అగర్వాల్, సమంత, విజయ్, తనూజ ఇలా పలువురు ఫ్యాన్స్ వలన చాలా ఇబ్బందికి గురయ్యారు. ఇక ఇప్పుడు ఇదే జాబితాలో అమితాబ్ బచ్చన్ కూడా చేరారు. సూరత్ ఎయిర్ పోర్ట్‌లో ఆయనని చూసేందుకు భారీ ఎత్తున ఫ్యాన్స్ తరలి రాగా, ఆయన తన కారు వద్దకు చేరుకోవడం చాలా కష్టంగా మారింది. అభిమానుల తాకిడి ఒకేసారి ఎక్కువ కావడంతో విమానాశ్రయం ద్వారం వద్ద ఉన్న గ్లాస్ పగిలిపోయింది. ఆ సమయంలో అమితాబ్ కాస్త దూరంగా ఉండడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక ఇదిలా ఉంటే ముంబైలోని తన నివాసం ‘జల్సా’ వద్ద ప్రతి ఆదివారం అభిమానులను పలకరించడం అమితాబ్ బచ్చన్‌కు ఎన్నేళ్లుగా కొనసాగుతున్న ఒక సంప్రదాయంలా మారింది. అయితే ఇటీవల తన ఇంటి వద్ద కనిపించిన అభిమానుల భారీ సంఖ్య, వారి ఉత్సాహం, నిరంతర నినాదాలు బిగ్ బీని భావోద్వేగానికి గురి చేశాయి. జల్సా బయట చేరిన జనసంద్రం తన కోసం కేరింతలు కొడుతుంటే, ఆ ప్రేమను చూసి తాను ఆశ్చర్యపోయినట్టు అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. ఈ సందర్భంగా అక్కడి దృశ్యాలను వీడియోల రూపంలో తన బ్లాగ్‌లో పంచుకున్న ఆయన, అభిమానుల అనురాగంపై మనస్ఫూర్తిగా స్పందించారు.
తనపై అభిమానులు చూపుతున్న ప్రేమను మాటల్లో వివరించడం కష్టమని చెప్పిన అమితాబ్, ఇంతటి ఆప్యాయత తనకు ఎలా దక్కిందన్నది తనకే ఒక మిస్టరీలా అనిపిస్తోందని పేర్కొన్నారు. తాను చేసిన పనులకన్నా ఎంతో ఎక్కువగా అభిమానులు ప్రేమ చూపిస్తున్నారని, ఆ అనుబంధాన్ని జీవితాంతం మర్చిపోలేనని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. అభిమానుల ప్రేమ తనను ఎప్పటికప్పుడు వినయంగా ఉండేలా చేస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. జల్సా వద్ద కనిపించిన జనసంద్రంలో మరో ఆసక్తికర సంఘటన కూడా చోటు చేసుకుంది. ఒక అభిమాని అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఫోటో ఉన్న పోస్టర్‌ను పట్టుకుని, అందులో ఆయన సినిమాలను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడం అమితాబ్ దృష్టిని ఆకర్షించింది. దీనిపై స్పందించిన బిగ్ బీ, తండ్రిగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొడుకు ఎప్పుడూ గర్వాన్ని, గౌరవాన్ని తీసుకొస్తాడని, అటువంటి క్షణాలను చూడడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.