Amitabh Bachchan | బాలీవుడ్లో బిగ్ బీగా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్న అమితాబ్ బచ్చన్ మరోసారి తన భావోద్వేగాలతో ప్రేక్షకుల హృదయాలను తాకారు. ఎనిమిది పదుల వయసులోనూ సినిమాల్లో, టెలివిజన్ షోలలో అదే ఎనర్జీతో కొనసాగుతున్న ఆయన… తాజాగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) సీజన్ 17 గ్రాండ్ ఫినాలే సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు.గత 25 సంవత్సరాలుగా కేబీసీతో విడదీయరాని బంధాన్ని కొనసాగిస్తున్న అమితాబ్ బచ్చన్, ఫినాలే ఎపిసోడ్లో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
“నా జీవితంలో దాదాపు మూడింట ఒక వంతు సమయాన్ని మీతో, ఈ కార్యక్రమంతో గడపడం నా అదృష్టం” అంటూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మాటలతో పాటు ఆయన కళ్లలో మెరిసిన కన్నీళ్లు అభిమానులను కూడా కదిలించాయి. సామాన్యులకు అగ్నిపరీక్షలా నిలిచే ఈ షో ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది తమ జ్ఞానాన్ని నిరూపించుకొని కోట్ల రూపాయల బహుమతులు గెలుచుకున్నారు. హోస్ట్‌గా అమితాబ్ బచ్చన్ చూపించిన ఆత్మీయత, ప్రోత్సాహం కేబీసీకి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. 17 సీజన్లుగా ఆయన హోస్టింగ్నే ఈ షోకు ప్రాణంగా మారింది.
గ్రాండ్ ఫినాలేలో అమితాబ్ బచ్చన్ భావోద్వేగానికి లోనవ్వడంతో, ఇది కేబీసీకి చివరి సీజనా అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేకపోవడంతో, ఫినాలే ఎపిసోడ్‌లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీవీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ముగింపు ఎపిసోడ్లో అగస్త్య నంద ప్రత్యేక సందడి చేయనుండగా, కికు శారదా హాస్యంతో నవ్వులు పూయించనున్నారు. అంతేకాదు, బిగ్ బీ అరుదైన సంగీత ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కేబీసీతో అమితాబ్ బచ్చన్‌కి ఉన్న అనుబంధం మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడంతో, ఈ గ్రాండ్ ఫినాలే భావోద్వేగాల పండుగగా మారింది. ఇక కేబీసీ ప్రయాణం ఇక్కడితో ముగుస్తుందా? లేక మరో సీజన్‌తో తిరిగి రానుందా? అన్నది తెలుసుకోవాలంటే ఫినాలే ఎపిసోడ్ వరకు ఎదురుచూడాల్సిందే.