కోల్‌కతాలోని ఓ షిప్పింగ్ యార్డ్‌లో చిరు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన అమితాబ్‌ని కాలం ముంబయ్‌కి నడిపించింది. నటుడ్ని చేసింది. సూపర్‌స్టార్‌ని చేసింది. ప్రస్తుతం ఆయన సూపర్స్టార్లకే సూపర్‌స్టార్. 80ఏండ్లు దాటినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలతో పోటీపడుతున్నారు బిగ్‌బీ. రీసెంట్గా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో తన కెరీర్ మొదలైన తొలినాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు అమితాబ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ తల్లిదండ్రుల్ని చూసిన బిగ్బీకీ తన అమ్మానాన్నలు గుర్తుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అమ్మానాన్నలతో రెస్టారెంట్‌కి వెళ్లిన రోజును జీవితంలో మర్చిపోలేను. నా తొలి సంపాదనతో దిల్లీలోని మోతీ మహల్ రెస్టారెంట్‌కి మా అమ్మానాన్నల్ని తీసుకెళ్లాను. నిజంగా ఆ వాతావరణం చూస్తే భయం వేసింది. చుట్టూ సంపన్నులు, ప్రముఖులు కనిపిస్తున్నారు. వాళ్లు మమ్మల్ని ఎలా చూస్తారో.. ఏమనుకుంటారో.. అని భయపడిపోయాను. వాళ్లంతా ఖరీదైన దుస్తులు ధరించి ఉన్నారు. మేమేమో మధ్య తరగతివాళ్లం. అందుకే.. తెలీని ఇబ్బంది. ఎలాగొలా లంచ్ చేసి బయటపడ్డాం.’అంటూ ఆ రోజుల్ని నెమరువేసుకున్నారు బిగ్‌బీ.