Aishwarya-Abhishek | మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జంట విడాకులు తీసుకోబోతున్నదంటూ ఇటీవల వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అభిషేక్ నటి నిమ్రత్ కౌర్‌తో రిలేషన్లో ఉన్నాడని.. ఈ క్రమంలోనై ఐష్ నుంచి విడిపోనున్నట్లుగా బాలీవుడ్ కోడై కూస్తున్నది. ఈ క్రమంలోనే ఏ పార్టీకి హాజరైనా బచ్చన్ ఫ్యామిలీ కుటుంబంతో సహా హాజరవుతున్నా.. ఐశ్వర్య మాత్రం కూతురు ఆరాధ్యతో కలిసి వేరుగా హాజరవడం ఈ వార్తలకు మరింత ఆజ్యంపోసినట్లయ్యింది. అలాగే, ఆరాధ్య బర్త్ డే వేడుకలకు సైతం అభిషేక్ దూరంగా ఉండడం గమనార్హం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాయ్‌తో విడాకులపై స్పందించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
ఐశ్వర్య తల్లిగా పలు బాధ్యతలు తీసుకుందని.. తల్లి అయిన తర్వాత తన కెరీర్‌ను త్యాగం చేసిందని చెప్పాడు. సినిమాల్లో నటించేందుకు తనకు అనుమతి ఇచ్చినందుకు ఐశ్వర్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నాడు. సినిమాల్లో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఐశ్వర్య కూతురు ఆరాధ్యతో ఇంట్లోనే ఉంటుందని.. ఈ విషయం తనకు తెలుసునన్నాడు. అయితే, పిల్లలు ఇలా ఆలోచించరనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు. పిల్లలు మూడో వ్యక్తిగా చూడరని.. తల్లిదండ్రులు చూస్తారన్నారు. చిన్నతంలో తన తల్లిదండ్రులు చుట్టూ లేరని ఎప్పుడూ అనిపించలేదని.. తాను పుట్టగానే అమ్మ (బయాబచ్చన్) సినిమాల్లో నటించడం మానేసిందని.. దాంతో తండ్రి లేని అనుభూతిని ఎప్పుడూ అనుభవించలేదని చెప్పాడు.
అభిషేక్ 1976లో జన్మించగా.. ఆ తర్వాత జయాబచ్చన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ కెరీయర్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అభిషేక్, ఐశ్వర్యరాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో ఈ జంటకు ఆరాధ్య జన్మించింది. ఇటీవల ఆరాధ్య 13వ పుట్టిన రోజును తల్లి ఐశ్వర్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నది. అయితే, బర్త్‌డే పార్టీ వేడుకల్లో అభిషేక్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఐశ్వర్య ఆరాధ్య పుట్టిన తర్వాత ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉంది. 2015లో జబ్బా సినిమాలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. గత కొన్నేళ్లుగా ఎంపిక చేసిన చిత్రాల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నది. సర్బ్జిత్, ఏదిల్ హై ముష్కిల్, ఫన్నీ ఖాన్, పొన్నియన్ సెల్వన్ తదితర ఫ్రాంచైజీల్లో నటించింది.