AM Ratnam | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. అయితే ఏఎం రత్నం ఆరోగ్యం గురించి ఆందోళన కలిగించే రూమర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ నెట్టింట పలు వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో సినీ ప్రియులు ఆందోళన చెందారు.మూవీ రిలీజ్ షెడ్యూల్ టెన్షన్స్ వల్లనే ఆయన అస్వస్థతకు గురి అయ్యారనే టాక్ వినిపించింది. వీటిపై ఆయన సోదరుడు, నిర్మాత దయాకర్ రావు స్పష్టత ఇచ్చారు. వాటిని నమ్మెద్దని విజ్ఞప్తి చేశారు.
అన్నయ్య ఏఎం రత్నం ఆరోగ్యం గురించి వచ్చిన రూమర్స్ నమ్మకండి. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి అంటూ పేర్కొన్నారు. దీంతో పుకార్లకి పులిస్టాప్ పడింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించగా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. పవన్ గత రాత్రి తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసినట్లుగా చిత్ర బృందం తెలిపింది. ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేశారని టీమ్ చెప్పింది.
ఇక రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. తమ సినిమాకు సంబంధించిన విషయాలపై చర్చించడానికి విలువైన సమయాన్ని కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఏఎం రత్నం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ ఓ పోరాట యోధుడిగా కనిపించనున్నారు.