Allu Arjun | అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప-2’ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలునెలకొన్ని వున్నాయి. ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే చిత్రం గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
తమిళ అగ్ర దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను తెరకెక్కించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అధికారిక ప్రకటనకు రంగం సిద్ధమైందని తెలిసింది. మరో వారం రోజుల్లో నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనుందని సమాచారం.
‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు అగ్ర హీరో అల్లు అర్జున్. ఇక ‘జవాన్’ చిత్రంతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు తమిళ దర్శకుడు అట్లీ. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులకు ఇక పండగే అనుకోవచ్చు.