69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరిగింది. 2021వ సంవత్సరానికి చెందిన జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికలో తెలుగు సినిమా హవా చూపించిన విషయం తెలిసిందే. ‘పుష్ప’ చిత్రానికి గాను ఉత్తమనటుడిగా అల్లు అర్జున్, ‘కొండపొలం’ చిత్రంలోని గీతానికి ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ అవార్డులు అందుకోగా, ‘ఉప్పెన’ చిత్రానికి గాను ఉత్తమ ప్రాంతీయ తెలుగు సినిమా పురస్కారాన్ని చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సాన అందుకున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం గెలుచుకున్న అవార్డులను రాజమౌళి అందుకున్నారు. మొత్తంగా మంగళవారం ఢిల్లీలో వైభవంగా జరిగిన ఈ వేడుక తెలుగు సినీ కళాకారులతో కళకళలాడింది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమనటుడిగా అల్లు అర్జున్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ- ‘ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఒక కమర్షియల్ సినిమాకు ఉత్తమనటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నా’ అంటూ ‘తగ్గేదేలే..’ అనే ‘పుష్ప’ డైలాగ్‌తో ప్రసంగాన్ని ముగించారు.
తదనంతరం ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు గాను వచ్చిన అవార్డులను దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఆర్.ఆర్.ఆర్. దీనికోసం మా టీమ్ నాలుగేళ్లు కష్టపడింది. ఈ జాతీయ పురస్కారాలవల్ల మా బాధ్యత మరింత పెరిగింది’ అని రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు.
ఇక మహానటి వహీదా రెహమాన్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తన నటజీవితంలో తనకు అండదండగా నిలిచి, తన అభ్యున్నతికి కారకులైన అందరికీ తన అవార్డును అంకితమిస్తున్నట్లు వహీదా రెహమాన్ ప్రకటించారు.
ఇక జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైక ‘రాకెట్రీ’ చిత్రానికి చెందిన పురస్కారాన్ని ఆ చిత్ర దర్శకుడు, కథానాయకుడైన మాధవన్ అందుకున్నారు. 2021వ సంవత్సరానికి గాను, ఉత్తమనటి పురస్కారానికి ప్రభుత్వం ఇద్దరిని ఎంపిక చేసిన విషయం విదితమే.
గంగూబాయి కఠియావాడి, మిమి చిత్రాలకు గాను అలియాభట్, కృతి సనన్ అవార్డులను అందుకున్నారు. ఈ వేడుకలో ఈ ముద్దుగుమ్మలిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా అలియా భట్ అయితే పెళ్లి చీరలో అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. అలియా అవార్డు అందుకుంటుంటే ఆమె భర్త రణ్‌బీర్‌కపూర్ ఆ దృశ్యాన్ని వీడియో తీశాడు. అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకలో ఈ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.