Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, భారత యువ క్రికెటర్ , ఐపీఎల్ స్టార్ వెంకటేష్ అయ్యర్ మధ్య జరిగిన ప్రత్యేక భేటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా, క్రికెట్ రంగాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకోవడం విశేషం. తాజాగా వెంకటేష్ అయ్యర్‌ను కలిసిన సందర్భంగా అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. యువ భారత క్రికెటర్‌గా వెంకటేష్ ప్రతిభను ప్రశంసిస్తూ ఆయనపై తన అభిమానం వ్యక్తం చేశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ మీట్లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్‌కు వెంకటేష్ అయ్యర్ ఇచ్చిన ప్రత్యేక బహుమతి. అయాన్ కోసం తన సంతకంతో కూడిన ప్రత్యేక క్రికెట్ జెర్సీని వెంకటేష్ గిఫ్ట్‌గా అందించారు. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అయాన్‌కు మాత్రమే కాకుండా అల్లు అర్జున్ కుటుంబానికి కూడా ఆనందాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X) ద్వారా ప్రత్యేక సందేశం పోస్ట్ చేశారు. “ప్రతిభావంతుడైన యువ భారత క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ గారిని ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది. అల్లు అయాన్‌కు తన సంతకంతో కూడిన ప్రత్యేక జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీ భవిష్యత్తు ప్రయత్నాలన్నింటికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
ఇక ఈ ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు సినీ మరియు క్రికెట్ ప్రపంచాల కలయిక అంటూ కామెంట్లు చేస్తుంటే, మరికొందరు మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఈ పోస్ట్‌లను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ టోర్నీలో బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇటీవల హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆయన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 19 బంతుల్లోనే 44 పరుగులు చేసి భారీ షాట్లతో ప్రేక్షకులను అలరించాడు. అయితే వెంకటేష్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఓటమి పాలవగా హైదరాబాద్ విజయం సాధించింది.