Allu Arjun-Atlee | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న నిర్మాతలు, కాస్టింగ్ నుండి టెక్నికల్ టీమ్ దాకా ప్రతి అంశంలో రాజీ లేకుండా ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్లో రేంజ్లో ఈ సినిమాని తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణే నటిస్తుండటం ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలను పెంచింది.
ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం, తమిళ కమెడియన్ యోగిబాబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ‘జవాన్’ సినిమాలో అట్లీ – యోగిబాబు కాంబినేషన్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఓ భారీ సైన్స్ ఫిక్షన్ ప్రయోగాత్మక చిత్రంలో యోగిబాబు ఎలా మళ్ళీ అలరిస్తాడో అన్న ఉత్సుకత అభిమానుల్లో నెలకొంది. అలాగే, మృణాల్ ఠాకూర్ పాత్రకు సంబంధించిన డిటెయిల్స్ కూడా పెద్దగా బయటకు రాకపోవడంతో, ఆమె పాత్రపై కూడా మిస్టరీ ఏర్పడింది. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి తో సైన్స్ ఫిక్షన్ జానర్లో ఇండియన్ సినిమా కొత్త పంథాను ప్రారంభించగా, ఇప్పుడు అట్లీ తనదైన శైలిలో ఈ జానర్లోకి అడుగుపెడుతున్నాడు.
జవాన్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తన మార్క్ చూపిన అట్లీ, ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో మరో బిగ్ బడ్జెట్ విజన్‌ను తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై నాన్-థియేట్రికల్, డిజిటల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొనడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అట్లీ మేకింగ్ స్టైల్, అల్లు అర్జున్ క్రేజ్, దీపికా పదుకోన్ లైమ్లైట్తో కూడిన ఈ ప్రాజెక్ట్ పై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతూనే ఉంది. మరోవైపు ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్న నేపథ్యంలో మూవీపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.