దేశవ్యాప్తంగా ‘పుష్ప-2’ అఖండ విజయంతో దూసుకుపోతున్నది. అన్ని భాషల్లో పుష్పరాజ్ హవా కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్న తదుపరి సినిమాపై అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. ఈ సినిమా అప్డేట్స్ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక కథాంశం గురించి అనేక కథనాలు ప్రచారమవుతున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం పీరియాడిక్ కథాంశాన్ని ఎంచుకున్నారని, పాన్ ఇండియాకు రీచ్ అయ్యేలా స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్దుతున్నారని అంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం మార్చిలో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకొస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లు, అన్ని భాషల్లో లభిస్తున్న ఆదరణ దృష్ట్యా తన సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపికపై త్రివ్రిక్రమ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెబుతున్నారు. బాలీవుడ్‌తో పాటు వివిధ భాషలకు చెందిన అగ్ర నటులను సినిమాలో భాగం చేయబోతున్నారని సమాచారం. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాల తర్వాత త్రివిక్రమ్-బన్నీ కలయికలో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై యస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.