అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఇంట విషాదం చోటు చేసుకున్నది. ఆయన తల్లి, దివంగత మహానటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి అయిన కనకరత్నమ్మ(94) కన్ను మూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అల్లు రామలింగయ్య, కనకరత్నమ్మలకు నలుగురు సంతానం. వారిలో అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ ఉన్నారు.
కనకరత్నమ్మ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమె పార్ధివదేహానికి నివాళులర్పించేందుకు అల్లు అరవింద్ ఇంటికి భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ కోకాపేటలో శనివారం కనకరత్నమ్మ అంత్యక్రియలు జరిగాయి. అల్లు కుటుంబ సభ్యులు, చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు పలువురు పరిశ్రమ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.