గీతా ఆర్ట్స్ సంస్థ ప్రస్తుతం మహాభారతంపై దృష్టి పెట్టింది. అత్యంత భారీగా మూడు భాగాల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్రణాళికలు రచిస్తున్నట్టు ఫిల్మ్ వర్గాల టాక్. దీనికోసం కొంతమంది రచయితలతో చర్చలు కూడా జరిగాయని తెలిసింది. మహాభారతాన్ని లోతుగా అధ్యయనం చేసి, అందులోని ఆసక్తికరమైన అంశాలను వెలికితీసేందుకు ఓ టీమ్ ఇప్పటికే పనిచేస్తున్నదని సమాచారం.
మహాభారత కథాంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. అయితే ఈ సారి అర్జునుడి కోణంలో కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అర్జునుడిగా అల్లు అర్జున్ కనిపించే అవకాశం ఉంది. బన్నీతోపాటు పాన్ ఇండియాలో ప్రధానమైన కొందరు తారలు కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యే అవకాశం ఉంది.
అయితే.. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు? అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి జీవితాశయం మహాభారతం. ఆయనే అదృశ్యంగా ఉండి కథంతా నడిపిస్తున్నట్టు కూడా ఓ టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నది. ఆ అవకాశాన్ని కూడా లేకపోలేదు. ఒకవేళ రాజమౌళి ఆలోచన వేరేలా ఉంటే.. గీతా ఆర్ట్స్ మరో దర్శకుడ్ని చూసుకోవాల్సిందే. ఇంతకీ ఈ మహాభారతానికి దర్శకుడెవరో?