Allu Aravind | నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మాటలు మరోసారి వివాదానికి దారితీశాయి. సినీ ఈవెంట్లలో ఆయన చేసే వ్యాఖ్యలు తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఇటీవల జరిగిన ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆయన అల్లు అరవింద్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆ వేడుకలో బండ్ల గణేష్ మాట్లాడుతూ ..“ఇండస్ట్రీలో కొన్ని వందల కోట్లలో ఎవరో ఒకరికి అన్నీ దక్కుతాయి. ఒక స్టార్ కమెడియన్‌కి కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్ బామ్మర్దిగా, ఒక ఐకాన్ స్టార్ తండ్రిగా ఉంటాడు. ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. జీవితంలో అంత మహర్జాతకుడ్ని నేను చూడలేదు” అంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా “బన్నీ వాసు ఎంత కష్టపడ్డా, లాస్ట్ మినిట్‌లో అల్లు అరవింద్ వచ్చి పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అట్లాంటిది” అని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కొందరు బండ్ల గణేష్‌కి మద్దతు ఇస్తే, మరికొందరు ఆయన మాటలు అవసరంలేని వివాదం సృష్టించాయని విమర్శించారు. తాజాగా జరిగిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధులు ఈ అంశంపై అల్లు అరవింద్ ను ప్రశ్నించారు. దీనిపై అరవింద్ ప్రతిస్పందిస్తూ.. నాకు ఒక స్థాయి ఉంది. కాబట్టి నేను దానికి సమాధానం చెప్పాలని అనుకోవడం లేదు అని అన్నారు.
అయితే ఆయన ఈ మాటలతోనే బండ్ల గణేష్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చినట్టే అనిపించిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సినీ వర్గాల్లో ప్రస్తుతం ఈ మాటల యుద్ధం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు, బండ్ల గణేష్ స్పందిస్తారా లేదా అన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది. కాగా, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన “ది గర్ల్‌ఫ్రెండ్” నవంబర్ 7న విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసింది. సమాజంలోని లవ్, రిలేషన్షిప్ సమస్యలను సున్నితంగా చూపించే ఈ కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.