సినిమా పేరు : బచ్చలమల్లి
తారాగణం: అల్లరి నరేశ్, అమృత అయ్యర్, రోహిణి, రావురమేశ్, అచ్యుత్‌కుమార్, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్…
దర్శకత్వం: సుబ్బు మంగాదేవి
నిర్మాతలు: రాజేష్ దండా, బాలాజీ గుత్తా
విడుదల: హాస్య మూవీస్
కామెడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, కామెడీ సినిమాలతో ఎదిగినా.. అల్లరి నరేశ్ (Allari Naresh)కు నటుడిగా గుర్తింపు తెచ్చినవి మాత్రం ఎమోషనల్ కథలే. నేను, గమ్యం, శంభోశివశంభో, పోరాలీ(తమిళం), నాంది, ఉగ్రం.. సినిమాలే అందుకు ఉదాహరణ. ఈ శుక్రవారం విడుదలైన ‘బచ్చలమల్లి’ కూడా ఆ తరహా కథే. ‘బచ్చలమల్లి’ అనే నిజజీవిత పాత్రను ప్రేరణగా తీసుకొని సుబ్బు మంగాదేవి రాసిన ఈ కథపై విడుదలకు ముందే అంచనాలు మొదలయ్యాయి.
పైగా ప్రచారంలో భాగంగా అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. ‘గమ్యం’లో గాలిశీను పాత్ర మీకెలా గుర్తుండిపోయిందో.. ‘బచ్చలమల్లి’ కూడా ఓ పదేళ్ల పాటు మీ హృదయాల్లో అలా గుర్తుండిపోతుంది’ అన్నారు. విడుదలకు ముందు చిత్రబృందం ఈ సినిమా విజయంపై ఎంతో కాన్ఫిడెంట్‌ని కనబరిచారు. మరి వారందరి అంచనాలను ‘బచ్చలమల్లి’ అందుకున్నాడా? జనం మెచ్చేలా ‘బచ్చలమల్లి’ తెరకెక్కిందా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ముందు కథలోకెళ్లాలి.
కథ :
బచ్చలమల్లి(అల్లరి నరేశ్).. తాగుబోతు.. తిరుగుబోతు.. పొగరుబోతు. వీటికితోడు మూర్తీభవించిన మూర్ఖత్వం.. మొత్తంగా దుర్వెసనాలన్నీ మనిషిరూపం తీసుకుంటే అదే ‘బచ్చలమల్లి’. నిజానికి తను టెన్త్‌లో జిల్లా ఫస్ట్. కానీ తనెంతో ప్రేమించే తన తండ్రి(బలగం జయరాం) వేరే స్త్రీతో సంబంధం పెట్టుకొని.. తన తల్లినీ, కుటుంబాన్నీ వదిలి వెళ్లిపోయాడన్న కసితో.. తండ్రినేం చేయలేక, తనకు తాను శిక్ష విధించుకున్నాడు. దుర్వెసనాలకు బానిసగా మారతాడు. తండ్రిని బద్ధ శత్రువుగా చూస్తుంటాడు. దగ్గరకు రావాలని తండ్రి ప్రయత్నించినా పురుగును చూసినట్టు చూస్తుంటాడు. ట్రాక్టర్ నడుపుతూ, వచ్చిన ఆదాయంలో కొంత ఇంట్లో ఇచ్చి, మిగతా డబ్బుతో తాగుతూ బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు. అలాంటి బచ్చలమల్లి జీవితంలోకి కావేరి(అమృత అయ్యర్) ప్రవేశిస్తుంది. తనతో అద్భుతమైన జీవితాన్ని ఊహించుకుంటాడు. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెడతాడు. దుర్వెసనాలన్నింటినీ వదిలేస్తాడు.. కానీ మూర్ఖత్వాన్ని మాత్రం వదలడు. ఆ మూర్ఖత్వం వల్ల తను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవలసివచ్చింది? తండ్రీకొడుకుల కథ ఎలాంటి మలుపు తీసుకుంది? కావేరితో ప్రేమకథ సుఖాంతం అయ్యిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ :
మూర్ఖత్వంతో దిద్దుకోలేని తప్పులు చేసిన ఇద్దరు తండ్రీకొడుకుల కథ ఇది. కుటుంబాన్ని వదిలి దిద్దుకోలేని ఒకేఒక్క తప్పు తండ్రి చేస్తే.. జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ దిద్దుకోలేని తప్పులు చేస్తూనే ఉన్న మూర్ఖుడు బచ్చలమల్లి. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకునే ఇలాంటి వ్యక్తులు సమాజంలో చాలామంది మనకు తారసపడుతుంటారు. వారందరికీ ఈ సినిమా ఓ పాఠం. వెనక్కెళ్లి సరిచేసుకోలేని తప్పులు చేయకూడదని సమాజానికి అద్భుతమైన సందేశం ఇచ్చాడు ఈ సినిమా ద్వారా దర్శకుడు సుబ్బు మంగాదేవి.
మనం చేసే తప్పు.. ఏదో ఒకరూపంలో తిరిగి మనల్నే శిక్షిస్తుందని ఈ కథతో చెప్పాడు. అయితే.. కథను బట్టి చూస్తే.. తండ్రిపై బచ్చలమల్లికి ఉండాల్సింది కేవలం కోపం మాత్రమే.. పగ కాదు. కానీ.. ఏదో పగబట్టినట్టు చూపించాడు దర్శకుడు. మరీ అంత ద్వేషించాల్సిన అసరరం కనిపించదు. అయితే.. తనను వద్దు అనుకునేవాళ్లను తాను కూడా వద్దు అనుకోవడం వరకు బాగానే ఉంది. కానీ.. అసహ్యించుకోవడం.. పురుగును చూసినట్టు చూడటం ఏదైతే ఉందో.. అదే పంటికింద రాయిలా అనిపిస్తుంది. పాత్రల్ని, కథా నేపథ్యాన్ని ఆవిష్కరించడంలో చూపించిన నిజాయితీ, ప్రథమార్ధం కథను చెప్పే విధానంలో కాస్త లోపించింది.
హీరో ధోరణి వల్ల తన చుట్టూ ఉన్న వాళ్లు ఇబ్బంది పడుతుంటే.. అతని పాత్రపై కోపం వస్తుంది. అయితే.. హీరో మనస్తత్వంపై ఆడియన్స్‌కి ద్వితీయార్ధంలో క్లారిటీ వస్తుంది. అక్కడ్నుంచి ప్రేక్షకులు సినిమా చూసే దృక్కోణంలో కూడా మార్పు వస్తుంది. సెకండాఫ్ మాత్రం అద్భుతంగా మలిచాడు. దర్శకుడు ఎక్కడా గందరగోళం లేకుండా మూడు పార్శాలుగా ఈ కథను నడిపించాడు. 1980s నుంచి 2005 వరకూ ఈ కథ సాగుతుంది. ఆ రోజుల్లోకి ఆడియన్స్‌ని తీసుకెళ్లాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి.
ఎవరెవరు ఎలా చేశారు?
అల్లరి నరేశ్ వన్‌మ్యాన్ షో ఈ సినిమా. తను పూర్తిగా ‘బచ్చలమల్లి’గా మారిపోయాడనే చెప్పాలి. తాను చెప్పినట్టే గాలిశీనులా బచ్చలమల్లి కూడా జనాలకు గుర్తుండిపోతాడు. అంత బాగా నటించాడు తను. ఆ పాత్ర తాలూకు మూర్ఖత్వాన్ని అద్భుతంగా పలికించాడు. కొత్త తరహా డైలాగ్ డెలివరీతో ఇరగదీసేశాడు అల్లరి నరేశ్. ఇక కావేరిగా అమృత అయ్యార్ చాలా చక్కగా అభినయించింది. భావోద్వేగాలను కూడా అద్భుతంగా పలికించింది. ఈ సినిమాలో అల్లరి నరేశ్ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర రావు రమేశ్‌ది. ఆయన కెరీర్లో గుర్తుండిపోయే పాత్రల్లో ఇందులోని పాత్ర కూడా ఒకటి నిలుస్తుంది. మిగతా నటీనటులంతా కూడా తమ తమ పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు.
సాంకేతికంగా..
తండ్రి విషయంలో హీరో పాత్ర పోకడ కథ డిమాండ్ మేరకు లేదు. ఈ విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. కానీ.. మిగతా విషయాలన్నీ సూపర్. చాలాకాలం తర్వాత జీవం ఉన్న పాత్రలు తెరపై కనిపించాయి. కథనంలో కాస్త వేగం తగ్గింది. మొత్తం దర్శకుడిగా సుబ్బు మంగాదేవికి మంచి మార్కులే పడ్డాయి. కెమెరా, సంగీతం, ఎడిటింగ్.. అన్నీ బావున్నాయి. మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే.. ఎమోషనల్ మూవీస్, మాస్ సినిమాలను ఇష్టపడే వారికీ ముఖ్యంగా రా అండ్ రస్టిక్ వాతావరణంతో కూడిన కథల్ని ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
బలాలు..
కథ, అల్లరి నరేశ్, రావురమేశ్ల నటన, ైక్లెమాక్స్..
బలహీనతలు..
కథనం
రేటింగ్ : 2.75/5
Pooja Hegde | పూజా హెగ్డే 2024 రౌండప్.. నో యాక్షన్.. నో రిలీజ్
Shankar | గెట్ రెడీ అంటోన్న శంకర్.. థియేటర్లలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3