‘మనందరం జీవితంలో తెలిసోతెలియకో తప్పులు చేస్తుంటాం. అయితే అనాలోచితంగా సరిదిద్దుకోలేని తప్పులు చేయొద్దనే పాయింట్‌ను బలంగా చెబుతూ ఈ సినిమా తీశాం’ అన్నారు సుబ్బు మంగాదేవి. ఆయన దర్శకత్వంలో అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన ‘బచ్చల మల్లి’ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు సుబ్బు మంగాదేవి పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అల్లరి నరేష్ బచ్చల మల్లి అనే ట్రాక్టర్ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడు.
అతనిలో మూర్ఖత్వం మోతాదు చాలా ఎక్కువ. ఆ కారణంగా అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే కథలో ఆసక్తికరమైన అంశం. అల్లరి నరేష్ సింగిల్ సిట్టింగ్లోఈ కథను ఓకే చేశాడు’ అన్నారు. సినిమాకు 90ల నేపథ్యం తీసుకోవడానికి కారణాల్ని వివరిస్తూ ‘ఈ సినిమాలో తండ్రి తాలూకు ఎమోషనల్ పాయింట్‌తో పాటు చక్కటి ప్రేమకథ ఉంటుంది. ఇప్పటి సెల్‌ఫోన్, సోషల్‌మీడియా యుగంలో ప్రేమకథల్ని భావోద్వేగభరితంగా చూపించలేకపోతున్నాం.
సెల్‌ఫోన్‌లేని సమయంలో వచ్చిన ప్రేమకథలు హృదయాలను కట్టిపడేసేవి. లవ్‌స్టోరీని హార్ట్ టచింగ్‌గా చెప్పాలనే ఉద్దేశంతో 90ల నేపథ్యాన్ని ఎంచుకున్నా’ అని తెలిపారు. బచ్చల మల్లి క్యారెక్టర్లో అల్లరి నరేష్ జీవించాడని, ఆయన కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర అవుతుందని, ‘సీతారామం’ వంటి చిత్రానికి పనిచేసిన విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్నందించాడని, నాలుగు పాటలు హైలైట్‌గా నిలుస్తాయని సుబ్బు మంగాదేవి పేర్కొన్నారు.