Allari Naresh | టాలీవుడ్లో మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్స్లో అల్లరి నరేష్ కూడా ఒకరు. నటన పరంగా ప్రాణం పెట్టి ప్రేక్షకులకి మంచి వినోదం పంచేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు. తన నటనతో ఎంత నవ్వించగలడో అంతే రీతిలో ఏడిపించగలడు ఈ అల్లరోడు. ఒకప్పుడు కామెడీ సినిమాలే చేసిన అల్లరి నరేష్ ఇప్పుడు జానర్ మార్చి సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు అల్లరి నరేష్ తన 63వ సినిమాతో బిజీగా ఉండగా, ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ .
అల్లరి నరేష్ తన కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్‌ను విభిన్న కథలతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన మెహర్ తేజ్ దర్శకత్వంలో ఓ నూతన చిత్రంలో నటిస్తున్నారు. ఇది అల్లరి నరేష్ కెరీర్లో 63వ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ రోజు అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా, సినిమా యూనిట్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమాకు ‘ఆల్కహాల్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ పోస్టర్లో నరేష్ ఆల్కహాలిజం లో మునిగిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఇది ఒక భ్రమ, వాస్తవికత మధ్య నడిచే కథ అని అర్థమవుతోంది.
ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రుహాని శర్మ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వివిధ భావోద్వేగాలతో నిండి ఉండే ఈ సినిమా, అల్లరి నరేష్‌కి మరో హిట్‌గా నిలవనుందని సినీ వర్గాలు ఆశిస్తున్నారు.ఇక ఈ రోజు అల్లరి నరేష్ బర్త్ డే కాగా, ఆయనకి సోషల్ మీడియాలో అభిమానుల నుండే కాక సినీ ప్రముఖుల నుండి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.