Ali | నటుడు ఆలీ ఈ మధ్య సినిమాలలో అంతగా కనిపించడం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన ఆలీ ఇప్పుడు అడపాదడపా మాత్రమే కనిపించి సందడి చేస్తున్నాడు.తాజాగా ఆయన సుహాస్ హీరోగా నటించిన ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాలో ఓ ఫుల్ లెంగ్త్ రోల్లో నటించారు. ఈ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్లో పాల్గొన్న అలీ తన పాత్ర గురించి మాట్లాడుతూ ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యేలా చేశారు. ఈ సినిమాలో నేను సుహాస్‌కు మామయ్య పాత్ర చేశాను. ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు నేనొక వ్యక్తిని గుర్తు చేసుకున్నాను అని అన్నారు.
దాదాపు 15 ఏళ్ల క్రితం నాకు ఒక మేనల్లుడు ఉండేవాడు. మా అక్క చనిపోయినప్పటి నుండి ఆమె కొడుకును మా అమ్మే పెంచింది. వాడు ఎదిగాక ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆమె తిరస్కరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరువాత మా అమ్మ ఎంతో బాధపడింది అని ఆలీ చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. ఈ సినిమా కథలో ఉన్న భావోద్వేగం నాకు ఎంతో దగ్గరగా అనిపించింది. ఆ కారణంగానే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను. సుహాస్‌ను స్క్రీన్ మీద చూసినప్పుడు నా మేనల్లుడు గుర్తొచ్చాడు అని పేర్కొన్నాడు. ఈ సినిమా ద్వారా ఆలీ కమెడీయన్‌గా కాకుండా మంచి నటనా సమర్థత ఉన్న నటుడని రుజువు చేయనున్నారు. సుహాస్, అలీ మధ్య ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలవనుంది.
‘ఓ భామ అయ్యో రామ’ ప్రేమ, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఫీల్-గుడ్ ఎమోషనల్ డ్రామాగా మన్ననలు పొందే అవకాశముంది. సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదాల తెరకెక్కించిన ఈ చిత్రంలో దర్శకుడు హరీశ్ శంకర్, మారుతి కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో ఒకవైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు భావోద్వేగాలను పంచింది.