అగ్ర హీరోలు భారీ పారితోషికాల్ని స్వీకరిస్తారనే విషయం తెలిసిందే. సినిమా బడ్జెట్లో సింహభాగం వారి రెమ్యునరేషన్స్ కోసమే చెల్లించాల్సి వస్తున్నదని నిర్మాతలు చెబుతుంటారు. సినిమా బడ్జెట్‌ను నియంత్రించాలంటే టాప్ హీరోలు తమ పారితోషికాల్ని తగ్గించుకోవాల్సిందేననే డిమాండ్ అన్ని భాషల్లో వినిపిస్తున్నది. తాజాగా ఈ విషయంలో ప్రశంసాపూర్వక నిర్ణయాన్ని తీసుకున్నారు బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్. గత కొన్నేళ్లుగా హిందీ చిత్రసీమలో ఆయనకు ఆశించిన విజయాలు దక్కడం లేదు.
ఇటీవల విడుదలైన ‘రక్షాబంధన్’ కూడా పరాజయం పాలైంది. దీంతో తన భవిష్యత్తు సినిమాల కోసం పారితోషికాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు అక్షయ్ కుమార్. గత ఐదేళ్లుగా ఒక్కో సినిమాకు దాదాపు 80 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్న ఆయన… తాజా నిర్ణయం మేరకు సినిమాకు కేవలం పది కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే స్వీకరిస్తాడట. సినిమా సక్సెస్ అయితే ఆ లాభాల్లో యాభైశాతం షేర్ ఇవ్వాల్సి ఉంటుందనే షరతు విధించినట్లు తెలిసింది.
తాను సొంతంగా నిర్మించే సినిమాల విషయంలో మాత్రం పారితోషికం ప్రస్తావన లేకుండా కేవలం ప్రాఫిట్స్‌నే తీసుకోవాలని అక్షయ్ కుమార్ నిర్ణయించుకున్నాడట. కొన్నేళ్లుగా అమీర్‌ఖాన్ ఇదే పద్దతిలో సినిమాలు చేస్తున్నాడని చెబుతున్నారు. అక్షయ్ కుమార్ తాజా నిర్ణయాన్ని నిర్మాతలు స్వాగతిస్తున్నారు.