Akshay Kumar | సినీ నటులు సినిమాలతో పాటు ఇతర మార్గాల్లో కూడా తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త రూట్లు వెతుక్కుంటారు. బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఫ్యాషన్ లైన్లు, ఫుడ్ బ్రాండ్లు ఇలా విభిన్న రంగాల్లోకి అడుగుపెడతారు. అలాంటి వ్యాపార చాతుర్యం చూపిస్తున్నవారిలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉన్నారు. తాజాగా ఆయన ఒక క్రేజీ బిజినెస్ ద్వారా వార్తల్లో నిలిచారు. అదే రియల్ ఎస్టేట్ ట్రేడింగ్. తక్కువ ధరకు ఫ్లాట్లు కొనుగోలు చేసి, మార్కెట్ విలువ పెరిగిన తర్వాత వాటిని అమ్మేస్తూ భారీ లాభాలను గడిస్తున్న ఆయన, ఈ రంగంలో తన తెలివితేటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
ఇటీవల అక్షయ్ కుమార్ ముంబై బోరివలి ప్రాంతంలో ఉన్న రెండు అపార్ట్మెంట్లను రూ. 7.10 కోట్లకు అమ్మారు. ఈ ఫ్లాట్లు ఆయన 2017లో కొనుగోలు చేశారు. కాలక్రమేణా వీటి విలువ భారీగా పెరగడంతో ఇప్పుడు సుమారు 92% లాభంతో విక్రయించగలిగారు.మొదటి అపార్ట్‌మెంట్‌ను అక్షయ్ రూ. 3.02 కోట్లకు కొనగా, ఇప్పుడు అది రూ. 5.75 కోట్లకు అమ్మారు. స్టాంప్ డ్యూటీగా రూ.34.50 లక్షలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు రూ.30,000 చెల్లించారు.రెండో అపార్ట్‌మెంట్‌ను రూ. 67.90 లక్షలకే కొనుగోలు చేసిన ఆయన, ప్రస్తుతం దాన్ని రూ. 1.35 కోట్లకు విక్రయించారు. ఇందులో స్టాంప్ డ్యూటీ రూ.6.75 లక్షలు, ఇతర రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ఉన్నాయి.
ఇది మాత్రమే కాదు. ఈ మార్చిలో అక్షయ్ కుమార్ అదే బోరివలి ఏరియాలోని మరొక రెండు ఫ్లాట్లను రూ.6.60 కోట్లకు విక్రయించారు. అలాగే, ఏప్రిల్‌లో ముంబై లోయర్ పరేల్ ప్రాంతంలోని ఓ ఆఫీస్ స్పేస్‌ను రూ.8 కోట్లకు అమ్మారు.ఈ వరుస ఆస్తుల విక్రయాలను చూస్తుంటే అక్షయ్ కుమార్ రియల్ ఎస్టేట్‌ను కేవలం హాబీగా కాకుండా సీరియస్ బిజినెస్‌గా తీసుకుంటున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. నటనతోపాటు ఇలా వ్యాపారంలోనూ విజయాలను సాధిస్తూ అక్షయ్ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.కాగా, బాలీవుడ్ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న అక్షయ్ కుమార్ కొన్నేళ్లుగా అక్షయ్ పెద్దగా హిట్లు కొట్టడం లేదు. సూర్యవంశీ తర్వాత, హౌస్ ఫుల్ 5 తప్ప, మిగితా సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.